ప్రక్షాళన జరిగేనా ! | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన జరిగేనా !

Published Tue, Oct 7 2014 2:35 AM

ప్రక్షాళన జరిగేనా ! - Sakshi

సాక్షి, నెల్లూరు :
 అవినీతి, అక్రమాలు, పైరవీలకు నెల్లూరు నగరపాలక సంస్థ నిలయంగా మారింది. చేయి తడపందే పని జరగదనే ఆరోపణను పలువురు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్నారు. సామాన్యుడు సంగతి అటుంచితే మంత్రి ఆదేశాలు సైతం అమలు చేసే వారు కరువయ్యారు. ఆదివారం నిర్వహించిన కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. నెల్లూరు కార్పొరేషన్ వరస్ట్ అని, అక్రమ కుళాయిలతో పాటు పలు విభాగాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని తాను ఆదేశించినా అధికారుల నుంచి స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. దీనిని బాగుపరిచే బాధ్యత తీసుకోవాలని కొత్తగా కమిషనర్‌గా వచ్చిన ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబుకు సూచించారు. యువకుడు కమిషనర్‌గా వచ్చారని, ఇక కార్పొరేషన్ సెగ అందరికీ తగులుతుందని ఏకంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే పేర్కొనడం గమనార్హం.

చక్రధర్ బాబు ముక్కుసూటిగా, కఠినంగా వ్యవహరిస్తారనే పేరుండడంతో ఇన్నాళ్లు కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించిన అవినీతి అధికారులు తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉన్నారని కార్పొరేషన్ కార్యాలయంలో చర్చసాగుతోంది. నగర ప్రజలు మాత్రం మెరుగైన పాలన కోసం ఎదురుచూస్తున్నారు.

 అడుగడుగునా అవినీతే..
 కార్పొరేషన్‌లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. ఆనం వారి పాలనా కాలంలో అది వేళ్లూనుకుపోయిందని ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యం విభాగాని కి సంబంధించి కాలువల్లో సిల్టు తొలగింపు మొదలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వరకు ప్రతి చోటా అవినీతే. పారిశుధ్య కార్మికులతో పాటు కాంట్రాక్టర్లకు పూడికతీత పనులు అప్పగిస్తున్నారు. వారు 20 శాతం మేర పూడికతీస్తే 80 శాతం తీసినట్లు రికార్డులు సృష్టించి కొందరు అధికారుల సహకారంతో అందినకాడికి దండుకుంటున్నారు.

  బ్లీచింగ్, సున్నం,ఆయిల్‌బాల్స్, దోమల నివారణ మందుల పిచికారీ తదితర కార్యక్రమాలు నామమాత్రంగా చేసి, విస్తృతంగా చేపట్టినట్లు తప్పుడు లెక్కలు చూపి నిధులు మింగుతున్నారు.
  ప్లాస్టిక్ నియంత్రణను విస్మరించి ప్లాస్టిక్‌కవర్ల ఉత్పత్తిదారులు, వ్యాపారుల నుంచి ముడుపులు అందుకుంటూ నిబంధనల అమలును గాలికి వదిలారు.

  పారిశుధ్య పనులకు సంబంధించిన సామగ్రి, కార్మికుల రక్షణ పరికరాల కొనుగోలులోనూ అక్రమాలు  జరుగుతున్నాయి.
  కార్మికుల లెక్కల్లోనూ అడుగడుగునా అక్రమాలే. వివిధ రకాల పనులకు నామమాత్రంగా కార్మికులను వినియోగించి, రికార్డుల్లో మాత్రం పెద్దసంఖ్యలను చూపి డబ్బులు స్వాహా చేస్తున్నారు. వారిలో ఇప్పటికే కొందరు కార్మికులు మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లలో పనిచేస్తున్నారు.

  జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ అవినీతిమయంగా మారింది. పత్రాలు నిబంధనల ప్రకారం లేవనే సాకుతో ఒక్కొక్కరి నుంచి రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేస్తున్నారు. భారీగా ముడుపులు తీసుకుని రికార్డుల్లో లేనివారి పేర్లతో సైతం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం.
  హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లోపించినా అధికారులు వారి నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారు. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు నిబంధనలు అతిక్రమించినా వారి నుంచి డబ్బులు గుంజి అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతి పత్రాలు మంజూరు చేస్తున్నారు.

  ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్ల దందా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ పరిధిలోని వివిధ రకాల పనులు ప్యాకేజీ రూపంలో కాంట్రాక్టర్లకు అప్పగించి భారీ మొత్తంలో అధికారులు ముడుపులు పొందుతున్నారు.

  కొందరు ఇంజనీరింగ్ అధికారులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి నామినేటెడ్ పనులు దక్కించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. పనులు చేయకుండానే బిల్లు చేసుకొన్న సందర్భాలూ కోకొల్లలు. నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా అందిన కాడికి దండి బిల్లు మంజూరు చేస్తున్నారు.
  మంచినీటి కుళాయిల మంజూరులో అక్రమాలకు అంతులేదు. భారీమొత్తంలో ముడుపులు పొంది అక్రమ కుళాయి కనెక్షన్లు మంజూరు చేసి ఇటు కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు.

  వాణిజ్య ,వ్యాపార సంస్థలకు కుళాయిల మంజూరు, మీటర్ల  ఏర్పాటులోనూ అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోంది.పండగలు, ఉత్సవాల సందర్భంగా కార్పొరేషన్ చేసే ఏర్పాట్లలోనూ అక్రమా లుజరుగుతున్నాయి.నామమాత్రంగాఖర్చుపెట్టి లెక్కలు భారీగా చూపుతున్నారు.

  టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతికి అంతే లేదు. అక్రమ నిర్మాణాలు,ఆక్రమణ ల విషయంలో కఠినంగా వ్యవహరించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాల్సిన అ ధికారులు చేతివాటం ప్రదర్శించి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ప్లాన్ అనుమతులు,మార్ట్‌గేజ్ రిలీజ్‌లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

  స్థలాలు అన్యాక్రాంత మౌతున్నా అధికారులు మిన్నకుండి పోతున్నారు.
  రెవెన్యూ విభాగానికి సంబంధించి పన్నుల వసూళ్లలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్ల యజమానుల నుంచి లంచాలు తీసుకొని  తక్కువ పన్ను వేస్తూ కొందరు సిబ్బంది ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలున్నాయి.

 దుకాణాల కేటాయింపులు, అద్దె వసూళ్లలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
  మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, సిబ్బంది ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి.

  రాజకీయ నాయకుల సిఫార్సులతో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులయ్యారు. మళ్లీ ఇప్పుడు మరికొందరి నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.  
  మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారి భర్తలు, కుటుంబసభ్యుల పెత్తనం మితిమీరింది. మేయర్  అనుచరుల పెత్తనం ముదిరి పాకాన పడింది. దీనికి తొలుత అడ్డకట్ట వేయాల్సివుంది.

Advertisement
Advertisement