కరోనా టెస్టులు పెద్ద ఎత్తున నిర్వహించాలి

28 Apr, 2020 03:08 IST|Sakshi

కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం వెనుకబడింది

రూ.1,500 సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోండి

కాంగ్రెస్‌ శాసనసభా పక్షం డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌/ ఖమ్మం: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అకాల వర్షాలు, పంటల కొనుగోళ్లు, ఇతర సమస్యలపై చర్చించేందుకు సీఎల్పీ సమావేశమైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిరలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌ బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొడెం వీరయ్యలతో పాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, అకాల వర్షాలు, యాసంగి పంటల కొనుగోళ్లపై చర్చించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్రం బాగా వెనుకబడిందని, ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన ప్రైవేట్‌ ల్యాబ్‌లలో ఎందుకు ఈ పరీక్షలు చేయడం లేదని సీఎల్పీ ప్రశ్నించింది. రూ.1,500 నగదు సాయం రాష్ట్రంలో ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

కరోనా సాకుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పై కేసులు పెట్టడం సరైంది కాదని, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తి వేయాలని పేర్కొంది. పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించింది. ఇతర రాష్ట్రాల్లో ధాన్యానికి బోనస్‌ ఇస్తుంటే ఇక్కడ మాత్రం తరుగు పేరుతో రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆక్షేపించింది. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని, డీజీపీని కలవాలని సీఎల్పీ నిర్ణయించింది. కష్ట కాలంలో ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, పేదలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

మరిన్ని వార్తలు