అంత్యక్రియలపై రగడ.. స్పందించిన ఈటల

21 May, 2020 13:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటుచేసుకుంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా తన భర్త అంత్యక్రియలు నిర్వహించారని జీహెచ్‌ఎంసీ, గాంధీ ఆస్పత్రిపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళుతూ ట్వీట్‌ చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌.. కరోనాతో ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే ఆ వ్యక్తి మరణించాడని, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
వనస్థలిపురంలోని మధుసూదన్‌ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకున్న మిగతా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.


స్పందించిన మంత్రి ఈటల
కరోనా బారిన పడి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలపై చెలరేగిన వివాదంపై మంత్రి ఈటల రాజేందర్‌ తాజాగా స్పందించారు. ‘వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కుటుంబం మొత్తానికి కరోనా వైరస్‌ సోకింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈశ్వరయ్య చనిపోయారు. అయన కుమారుడు మధుసూదన్‌ అదే రోజు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 1వ తేదీన చనిపోయారు. మధుసూదన్‌ మృతి గురించి పోలీసులకు చెప్పాము, అయితే తన భర్త చనిపోయాడని భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు, మరొకరి మృతి గురించి చెబితే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా అన్నారు.  అంతేకాకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలోనే ఉండటంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసింది. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేద’ని మంత్రి ఈటల రాజేందర్‌ వివరించారు. 

చదవండి:
తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం
ఇంట్లో నాగన్న.. బయట కరోనా

మరిన్ని వార్తలు