యాదాద్రికి కార్పొరేట్ల దన్ను!

8 Mar, 2015 01:30 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట అభివృద్ధికి బడా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయా? రాష్ట్రంలోనే అత్యద్భుత ఆధ్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు సహకరించేందుకు టాటా, అంబానీలు సిద్ధమయ్యారా? అవుననే సమాధానమిస్తున్నాయి రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు. శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువైన పుణ్యక్షేత్రం సమగ్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యక్రమం కింద యాదాద్రిపై సౌకర్యాల కల్పనకు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు రిలయన్స్, టాటా కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం. కొండ చుట్టూ, కొండపైనా భారీ మార్పుచేర్పులకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. కల్యాణ మంటపాలు, వేద పాఠశాలలు, అభయారణ్యం, వసతి సముదాయాలు వంటి వాటి నిర్మాణానికి సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతో ఇందులో సగం మేర నిధులు అందించేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తుండటం విశేషం.
 
 సీఎం చెప్పిన విధంగానే....
 
 గుట్ట అభివృద్ధికి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని సీఎం కేసీఆర్ కూడా ఇటీవల చెప్పారు. చినజీయర్ స్వామితో కలసి ఈ నెల 5న గుట్టకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించినట్లు తెలిసింది. ‘గుట్టలో దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా, రిలయన్స్ లాంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గుట్ట అభివృద్ధి విషయంలో నిధుల కోసం ఆలోచించాల్సిన పనిలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారని, గుట్ట అభివృద్ధికి భూ సేకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది. అందులో వెయ్యి ఎకరాలకుపైగా భూమిని ఇప్పటికే గుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇక రాయగిరిలో దిల్ సంస్థకు ఇచ్చిన భూమికి పక్కనే(ఇప్పుడు ఆ భూమిని కూడా గుట్ట అభివృద్ధి కోసం కేటాయించారు) మరో 300 ఎకరాలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీన్ని కూడా గుట్ట అథారిటీకి కేటాయించారని, ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీసీఎల్‌ఏ వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు.
 
 పుణ్యం.. పురుషార్థం
 
 యాదగిరిగుట్టలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అటు దైవకార్యంలో పాలుపంచుకోవడంతోపాటు కేంద్ర నిబంధనల మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)నూ నెరవేర్చినట్లు అవుతుందనే బడా సంస్థలు ముందుకు వస్తున్నట్లు గుట్ట అధికారులు చెబుతున్నారు. ‘వాస్తవానికి టాటా, రిలయన్స్ లాంటి కంపెనీలకు రూ. 500 కోట్ల నిధులు పెద్ద విషయమేమీ కాదు. సీఎస్‌ఆర్ నిబంధన ప్రకారం రూ. 100 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న కంపెనీలు.. అందులో రెండు శాతం మేర నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే నిధులను గుట్ట కింద అభివృద్ధి కోసమే వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. యాదగిరికొండపై ఉన్న 14.5 ఎకరాల భూమి లో 6 ఎకరాల స్థలంలో ప్రధానాలయం ఉంది. అలాగే పాత గుట్టతోపాటు గోశాల, నవగిరుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 156 ఎకరాలు ప్రస్తుతం దేవాదాయ శాఖ పరి ధిలో ఉంది. ఈ భూమిలో కార్పొరేట్ కంపెనీ లు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవని, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుట్ట కింద నిర్మించే కాటేజీలు, లక్ష్మీనృసింహ అభయారణ్యం, పార్కులు, పార్కింగ్ సౌకర్యం వంటి వాటికి కార్పొరేట్ నిధులను వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీలే కాటేజీలను నిర్మిస్తే వాటి నిర్వహణ బాధ్యతను కూడా వాటికే అప్పగిం చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే గుట్ట పరిసరాల అభివృద్ధి, ఖరీదైన హోటళ్లు, గుట్టకు రహదారి సౌకర్యాల కల్పన, ఇప్పటికే ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం, మోనోరైలు ఏర్పాటు వంటి వాటికి కూడా ఈ నిధులను వెచ్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు