అక్రమార్గాలు

10 Jul, 2014 04:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టులలో పని చేయడానికి జిల్లా, డివిజన్‌స్థాయి ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. అర్హత, అనుభవం, సిన్సియారిటీ ఉన్నా, లంచం పెట్టలేక అవకాశాలు కోల్పోతున్నామని కొందరు రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అక్రమ వసూళ్లకు నిలయాలు
 సాలూర, సలాబత్‌పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు అ క్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల శాఖలు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని యథేచ్ఛగా సాగిస్తున్న దందా ఏసీబీ అధికారులు పలుమార్లు దాడులు చేసినపుడు వెలుగు చూసినా, పరిస్థితి మాత్రం మారడం లేదు. మహారాష్ట్రకు సరిహద్దున బోధన్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సాలూర వద్ద ఉమ్మడి తనిఖీ కేంద్రం, (ఐసీపీ) అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడ రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులు వసూళ్ల దందాను సాగిస్తున్నారని తెలుస్తోంది. దందా అంతా రాత్రిపూట జరుగుతోంది.

ముందస్తు సమాచారం అందగానే ప్రైవేట్ వ్యక్తులు రంగంలో దిగి, అందినకాడికి దండుకుని వా హనాలను చెక్‌పోస్టులు దాటిస్తున్నారు. ఇక్కడి అధికారులు అక్రమ వసూళ్లకు సు లభమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నా రు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో, ఇక్క డి నుంచి మహారాష్ట్రకు సరుకుల లోడ్‌తో వెళ్లే వాహనాల రోడ్డు ట్యాక్స్, వే బిల్లులు, నిబంధనల మేరకు బరువులను తనిఖీ చేస్తా రు. 10 టన్నులు, 16 టన్నులు, 20 టన్నుల లోడ్ వాహనాలను నిబంధనల మేరకు అనుమతి ఇస్తారు. ఈ చెక్‌పోస్టులో సరుకులలోడ్ ను తూకం వేసేందుకు కొన్నేళ్ల క్రితం వే బ్రిడ్జిను ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటుంది.

 అధికారులు ఉద్దేశపూర్వకంగానే వేబ్రిడ్జి పనిచేయకుండా సాంకేతిక కారణాలు చూపుతున్నారని ఆరోపణలున్నాయి. వే బ్రిడ్జి పని చేయకపోవడంతో వాహనాదారుల వద్ద అం దినకాడికి దండుకుంటున్నారు. రోజుకు లక్షల రూపాయలలోనే అక్రమ వసూళ్లు కొనసాగుతాయని సమాచారం. రోజుకు 300 నుంచి 400 వరకు లారీలు, ఇతర వా హనాల రాకపోకలుంటాయి. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ నెల ఆఖరు వరకు మ హారాష్ట్ర ఇసుక క్వారీలనుంచి లారీలు, టిప్పర్లు రోజుకు సుమారు 300 వరకు ఇసుక లోడ్‌తో మన ప్రాంతానికి వస్తాయి. సరుకులు, ఇసుక ఓవర్ లోడ్‌తో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.

 సలాబత్‌పూర్ బీసీపీలో
 సలాబత్‌పూర్ చెక్‌పోస్టులోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడ ముగ్గురు ఏసీటీఓలు పని చేస్తారు. ఒక్కొక్కరికి రెండు రోజులు డ్యూటీ ఉంటుంది. రోజూ ఈ చెక్ పోస్టు గుండా 550 నుంచి 650 వందల లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఆన్‌లైన్ పద్ధతిలో లేదా, బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో ట్యాక్సు చెల్లించాలనే నిబంధన అమలులోకి వచ్చినప్పటి నుం చి, ఈ చెక్‌పోస్టుకు ఎలాంటి టార్గెట్ విధించలేదు. వే బిల్లులు, అన్ని రకాల పత్రాలు కలిగి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు ఇక్కడ ట్రాన్సిట్ పాసు (టీపీ) రిసిప్ట్ తీసుకొని స్టాంప్ వేసుకొని వెళ్తాయి.

 వారు సరుకులు ఏ జిల్లాకు వెళ్తున్నాయో అక్కడే టాక్స్ చెల్లిస్తారు. ప్రభుత్వ సెలవులు ఉన్నప్పుడు మాత్రమే ఈ చెక్‌పోస్టులో ట్యాక్సులు చెల్లిస్తారు. వేబిల్లులు లేని వాహనాల డ్రైవర్‌ల నుంచి ప్రతి లారీకి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. కేవలం మార్బుల్ రాయి ఉన్న వాహనాలు జీరో సరుకును తరలిస్తారు. మార్బుల్ లారీకి రూ. రెండు వేల నుంచి రూ. నాలుగు వేల వరకు అధికారులకు ముట్టజెబుతారు. ప్రతి నెల ఈ చెక్‌పోస్టు నుండి రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.

 దళారుల ప్రమేయంతో
 చెక్‌పోస్టు ఆవరణలోని ఎస్‌టీడీ బూత్‌లలో ఉండే దళారులు లారీ ట్రాన్స్‌పోర్ట్‌వాళ్లతో సంబంధాలు కలిగి ఉంటారు. లారీలను పాస్ చేయించగా వచ్చిన డబ్బును అధికారి, దళారి పంచుకుంటారు. ఇక్కడ ఎనిమిది ఎస్‌టీడీ బూత్‌లు ఉన్నాయి. ఇక్కడి దళారులు నెలకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు సంపాదిస్తారని అంచనా. ఈ చెక్‌పోస్టులో ఒక ఎంవీఐ, ఏడుగురు ఏఎంవీఐలు పని చేస్తారు. ఒక్కోక్కరికి వారంలో రెండు రోజులు డ్యూటీ ఉంటుంది. ఇక్కడ దళారులు రోడ్లపై అటు ఇటు తిరుగుతుంటారు. ఒక్కో అధికారికి ఒక్కో దళారి సెపరేట్‌గా ఉంటాడు. చెక్‌పోస్టులో ఏ అధికారి ఉంటాడో అతనికి సంబంధించిన దళారి మాత్రమే ఉంటాడు. అందరు దళారులు అక్కడే ఉండరు.

మరిన్ని వార్తలు