పత్తి కొనుగోలుకు సీసీఐ మరోమారు విముఖత

21 Nov, 2014 03:14 IST|Sakshi

ఖమ్మం వ్యవసాయం: పత్తి కొనుగోలుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి కనబరచటం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి గురువారం అమ్మకానికి వచ్చిన దాదాపు 25 వేల పత్తి బస్తాలను కొనేందుకు సీసీఐ బయ్యర్లు విముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచే వారు వెనుకడుగు వేశారు. బుధవారం రాత్రి 7 గంటల తరువాత గరువారం పత్తి కొనుగోలు చేయలేమని మార్కెట్ అధికారులకు సీసీఐ బయ్యర్ తెలిపారు.

జీళ్లచెరువు వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో పత్తి అన్‌లోడ్ చేయటానికి ఇబ్బందిగా ఉందని, మాయిశ్చర్ మిషన్లు సక్రమంగా పని చేయటం లేదని, సోమవారం కొనుగోలు చేసిన సరుకు కాంటాలు పూర్తికాలేదనే కారణాలు చూపుతూ సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేశారు. సోమవారం సరుకును కొనుగోలు చేసిన సీసీఐ మంగళ, బుధవారాల్లో దార్ని కాంటాలు పెట్టాలని గురువారం తిరిగి కొనుగోళ్లు జరుపుతామని ప్రకటించింది. ఆ విధంగానే మార్కెట్ అధికారులు మంగళ, బుధ వారాల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు ఉండవని ప్రకటించారు.

గురువారం నుంచి కొనుగోళ్లు ఉంటాయని బుధవారం రాత్రి నుంచే రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకురావడం ప్రారంభించారు. తీరా బుధవారం రాత్రి సీసీఐ బయ్యర్ గురువారం కూడా కొనుగోళ్లు చేయలేమని చెప్పారు. దీనికి మార్కెట్ అధికారులు అంగీకరించలేదు. గురువారం ఉదయం 9 గంటల వరకు కూడా సీసీఐ బయ్యర్ పత్తి కొనుగోలుకు రాకపోవటంతో వరంగల్ జోన్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పర్సన్ ఇన్‌చార్జి సుధాకర్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి బయ్యర్ వశిష్టను మార్కెట్ కార్యాలయానికి పిలిపించారు. పత్తి కొనుగోలు చేయటానికి పలు ఇబ్బందులున్నాయని బయ్యర్ అధికారులకు చెప్పారు. అందుకు  అధికారులు అంగీకరించ లేదు.

 సరుకును కొనుగోలు చేయాలని చెప్పారు. ఉదయం వేళలో మాయిశ్చర్ ఉంటుందని కాలం గడిపి 11:30 గంటల సమయంలో కొనుగోళ్లను ప్రారంభించారు. కేంద్రానికి వచ్చిన 25వేల బస్తాలలో కేవలం 12 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. వీటిని కూడా బయ్యర్ అనుచరులు మాయిశ్చర్ మిషన్‌తో పరీక్షలు నిర్వహించి కొనుగోలు చేశారు. సాయంత్రం 4:30 గంటల తరువాత కొనుగోళ్లను నిలిపివేయటంతో తమ సరుకును కూడా కొనుగోళ్లు జరపాలని రైతులు ఆందోళన చేశారు.

 మార్కెట్ అధికారులు బయ్యర్‌ను సంప్రదించి సరుకు కొనుగోలు చేయాలని కోరారు. శుక్రవారం సరుకు కొనుగోలు చేస్తానని చెప్పారు. అధికారులు రైతులకు సర్ది చెప్పారు. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకువస్తే రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులు కాయాల్సివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా