రోల్‌ కాల్‌ బ్రీఫింగ్‌.. లైఫ్‌ సేవింగ్‌

26 Jul, 2018 08:29 IST|Sakshi
కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు రివార్డు అందజేస్తున్న సీపీ అంజనీకుమార్‌

గత డిసెంబర్‌  ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

ఆ ప్రాంతంలో గస్తీ పెంచాలంటూ సూచనలు

బ్రిజేష్‌ను దీటుగా ఎదుర్కొన్న కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌

ప్రశంసించిన సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌(సిటీబ్యూరో): రోల్‌కాల్‌పై ఉన్నతాధికారులు చేసిన సూచనలను తిరుమలగిరి పోలీసులు పక్కాగా పాటించినందునే సీరియల్‌ రేపిస్టు బ్రిజేష్‌ కుమార్‌ యాదవ్‌ చిక్కాడు. 2012 డిసెంబర్‌లో ఓ మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అతను సోమవారం మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించి పట్టుబడ్డాడు. బుధవారం ఇతడి అరెస్టును ప్రకటించిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ‘హీరో ఆఫ్‌ సిటీ పోలీస్‌’ అని కితాబిచ్చారు. సిబ్బందికి ఆయన ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.  తిరుమలగిరి ఠాణా పరిధిలోని అమ్ముగూడ రైల్వేట్రాక్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గతేడాది డిసెంబర్‌ 21న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఓ యువకుడిపై దాడి చేయడంతో పాటు మాజీ సైనికాధికారి కుమార్తెపై (మైనర్‌) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసును కొలిక్కితేవడానికి తిరుమలగిరి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.

బాధితురాలి నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి, బేగంపేట ఏసీపీ  రంగారావు నిందితుడిని పట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ముగూడ రైల్వేట్రాక్‌ సమీపంలో రాత్రి వేళల్లో గస్తీ పెంచాలనిఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని  ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరరావు ప్రతి రోజూ రోల్‌కాల్‌ సమయంలో సిబ్బందికి స్పష్టం చేస్తూనే ఉన్నారు. సోమవారం తిరుమలగిరి ఠాణా రక్షక్‌ గస్తీ విధుల్లో కానిస్టేబుల్‌  చంద్రశేఖర్‌ (పీసీ 4691) ఉండగా ఆ వాహనానికి ఆర్మీ మాజీ అధికారి, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ హరిరామ్‌ శర్మ డ్రైవర్‌గా వ్యవహరించారు. రాత్రి 8.30 గంటల ప్రాతంలో ఆమ్ముగూడ రైల్వేట్రాక్‌ ఖో–ఇ–ఇమామ్‌ దర్గా సమీపంలో వాహనం దిగి నడుస్తున్న చంద్రశేఖర్‌ దూరంగా ముగ్గురు వ్యక్తుల మధ్య పెనుగులాట జరుగుతున్నట్లు గుర్తించాడు. సమీపంలో ఉన్న బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బ్రిజేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. తీవ్ర పెనుగులాట అనంతరం సీరియల్‌ రేపిస్ట్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  

నడిపించి వీడియో తీసి...
బ్రిజేష్‌ను తిరుమలగిరి ఠాణాకు తీసుకువచ్చి ప్రశ్నించగా గతేడాది  ఘటనతో తనకు సంబంధం లేదని వాదించాడు. అయితే అనేక సారూప్యతలు ఉన్న నేపథ్యంలో అప్పటి బాధితురాలి నుంచి సేకరించిన డీఎన్‌ఏతో ఇతడి డీఎన్‌ఏ మ్యాచ్‌ చేసే ప్రయత్నాలు చేశారు. అప్పుడు చీకట్లో బాధితురాలు బ్రిజేష్‌ ముఖం చూపకపోయినా అతడి కదలికలు, నడక గమనించినట్లు పోలీసులకు చెప్పింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న డీసీపీ ఆమెను రప్పించాలని భావించారు. అయితే ఆ కుటుంబం కొన్నాళ్ల క్రితమే ఒడిశా వెళ్లిపోయినట్లు తెలియడంతో అతికష్టమ్మీద బాధితురాలి తండ్రి సెల్‌ఫోన్‌ నెంబర్‌ సేకరించారు. బ్రిజేష్‌ను మసక వెలుతురులో నడిపిస్తూ ముందు వైపు, వెనుక వైపు నుంచి వీడియోలు తీయించి వాట్సాప్‌లో ఆమె తండ్రికి పంపారు. వాటిని చూసిన బాధితురాలు నాడు తనపై అఘాయిత్యం చేసిన బ్రిజేషేనంటూ గుర్తించింది. ఇదే విషయాన్ని డీఎన్‌ఏ రిపోర్టు సైతం నిర్ధారించింది.   

దాడి చేసి తప్పించుకోజూశాడు
ఆ ప్రాంతంలో ముగ్గురు కనిపించడంతో పాటు మహిళ అరుపులు, ఏడుపులు వినిపించడంతో అక్కడకు వెళ్ళా. అప్పటికే బ్రిజేష్‌ ఓ యువకుడిపై దాడి చేయడంతో పాటు యువతిని సమీపంలోని పొదల్లో లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా నా పై దాడి చేసి పారిపోయే ప్రయత్నంలో 20 అడుగుల గోతిలోకి దూకేశాడు. వెనుకే నేనూ దూకి ఒడిసిపట్టుకున్నా. హరిరామ్, బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ నరేంద్ర సాయంతో అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించాం.
– చంద్రశేఖర్, కానిస్టేబుల్‌ 

మరిన్ని వార్తలు