అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీపీ

11 Oct, 2019 18:16 IST|Sakshi
హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థులను మవోయిస్టులుగా మార్చే సంస్థలపై దర్యాప్తు కోసం డిటెక్టివ్ వింగ్‌లో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు నగర సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థలతో కొందరు విద్యార్థులు కలుస్తున్నారని.. తుపాకీ పట్టి హింస సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్‌ మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన ఇంట్లో అనేక పత్రాలు, మెమొరీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సీపీఐ మావోయిస్టు పార్టీ 50 వ వార్షికోత్సవానికి సంబందించిన కరపత్రాలు కూడా లభించినట్లు పేర్కొన్నారు.

అదే విధంగా తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన మద్దిలేటి, అనుదీప్‌, భరత్‌, సందీప్‌, కిషోర్‌లపై వరంగల్‌, కొత్తగూడెం, గద్వాల్‌, కాజీపేట ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. మేధావుల పేరుతో కొంతమంది అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా పెంచామని.. నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు