ప్రశాంత్‌ది కేవలం మిస్సింగ్ కేస్ మాత్రమే

19 Nov, 2019 17:04 IST|Sakshi

పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి

వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మకండి

సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్‌ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకరావాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోలీసులను నెటిజన్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్‌ సరిహద్దును దాటినట్లు వస్తున్న వార్తలపై సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ క్లారిటీ ఇచ్చారు. 

మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్‌ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇప్పటివరకు ప్రశాంత్‌ది కేవలం మిస్సింగ్‌ కేస్‌గా మాత్రమే నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో పూర్తి వివరాలు బయటపడతాయన్నారు అయితే సోషల్‌ మీడియాలో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఎవరైన అస​త్య ప్రచారాలు చేసినా, షేర్‌ చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరించారు. 

‘ప్రశాంత్‌ వ్యవహారంపై తెలంగాణ పోలీసుల ఆరా, ప్రశాంత్‌ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు, 10 నెలల క్రితమే ఇండియన్‌ రా ఏజెంట్‌ ప్రశాంత్‌ తండ్రి బాబురావు దగ్గరికి వచ్చినట్లు గుర్తింపు, పది నెలల క్రితమే ప్రశాంత్‌ వివరాలు అడిగిన రా ఏజెంట్‌, ప్రశాంత్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్లు బాబురావుకు పది నెలల క్రితమే సమాచారం ఇచ్చిన రా ఏజెంట్‌’ వంటి సందేశాలు, వార్తలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా షేర్‌ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని సజ్జనార్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు