పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేసేదాకా పోరు: తమ్మినేని

15 Jun, 2014 23:17 IST|Sakshi
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేసేదాకా పోరు: తమ్మినేని

మహబూబ్‌నగర్: గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌ను రద్దుచేసే వరకు పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు.  ఆదివారం ఆయన మహబూనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పోలవరంపై ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం అభినందనీయమని,  సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

రాజ్యాంగవిరుద్ధంగా, సీమాంధ్ర పాలకుల మెప్పు కోసం పోలవరంపై ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మోడీ చెప్పడం చూస్తుంటే ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందన్నారు.  రక్షణశాఖ, మీడియా రంగాల్లో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుతు తెచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ మాట్లాడుతూ.. ఖరీప్ మొదలైందని, విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టి వాటిని విక్రయిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాని కోరారు. సమావేశంలో రాష్ట్ర నేత కిల్లే గోపాల్, పట్టణ కార్యదర్శి కురుమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు