క్రైమ్స్‌ డౌన్‌

27 Dec, 2018 10:06 IST|Sakshi

సిటీ కమిషనరేట్‌ పరిధిలో తగ్గిన నేరాలు

వెల్లడించిన కొత్వాల్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: సిటీ కమిషనరేట్‌ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. వీటిని కొలిక్కి తేవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పీడీ యాక్ట్‌ ప్రయోగం వంటి చర్యలతో నేరగాళ్ల దూకుడుకు కళ్లెం పడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలూ సరాసరి ఆరు శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో పోలీసులు 92 శాతం రికవరీ సాధించారు. వరకట్న మరణాలు నగరంలో 38 శాతం నమోదు కాగా, మహిళలపై జరిగే దాడులు కూడా తగ్గాయి. హత్య కేసులు మాత్రం గత ఏడాదికంటే 8 శాతం పెరిగాయి. బుధవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్వాల్‌ అంజనీ కుమార్‌ 2018 నేర గణాంకాలను విడుదల చేశారు.     

ప్రతి అంకంలోనూ టెక్నాలజీ వినియోగం... నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర... నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్‌ ప్రయోగం వంటి చర్యలు... వెరసి నగరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లోనూ కలిపి సరాసరిన ఆరు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. సొత్తు సంబంధం నేరాలు 20.5 శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో రికవరీ 92 శాతానికి చేరుకుంది. వరకట్న చావుల్లో 38 శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మహిళలపై నేరాలు సైతం తగ్గాయి. కేవలం హత్య కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించిన కొత్వాల్‌ అంజనీ కుమార్‌ ఆ గణాంకాలను విడుదల చేశారు. కోర్టుల్లో కేసుల నిరూపణ సైతం 10 శాతం పెరిగి 34కి చేరిందని తెలిపారు. ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీసుకున్న చర్యల కారణంగా నగరంలో మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సరాసరి వేగం గంటలకు 18 నుంచి 25 కిమీకి చేరిందని వివరించారు. ఈ ఏడాది కొత్తగా సిటీ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, వెరీ ఫాస్ట్‌ యాప్, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్, ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ (వావ్‌) బృందాలను రంగంలోకి దింపారు. ‘ఈ ఏడాది సాధించిన విజయాలపై నేను మాట్లాడుతున్నా... అవి సాధించడంలో కొత్వాల్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకు అహర్నిశలు శ్రమించారు’ అని అంజనీకుమార్‌ పేర్కొన్నారు. 

‘ఫోర్స్‌’ చూపిన ‘టాస్క్‌’...
నగర పోలీసు కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌లో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలను చెక్‌ చెప్పడంతో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్‌ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ 20 హత్య, 54 దోపిడీ, 4 బందిపోటు దొంగతనం, 100 చోరీలు, 33 స్నాచింగ్స్, 29 దాడులు, 63 డ్రగ్‌ కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నాయి. 54 క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలపై దాడులు చేసి 101 మందిని అరెస్టు చేశాయి. ఇతర నేరాల్లో 85 మందిని పట్టుకున్నాయి. 107 చీటింగ్‌ కేసుల్లో 121 మందిని అరెస్టు చేశాయి. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 103 నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌ చేశాయి.

మరిన్ని వార్తలు