అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ

7 Aug, 2015 21:14 IST|Sakshi
అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ

మహబూబ్‌నగర్: వడ్డీ ఎంతయినా పర్వాలేదు.. నెలనెలా నిక్కచ్చిగా ఇస్తానన్నాడు. కొంతకాలం అలాగే చేశాడు. ఇంకేముంది అధిక వడ్డీ వస్తుంది కదా అని అతడికి వడ్డీకిచ్చిన వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల నుంచి కూడా అప్పులు ఇప్పించారు. తీరా రూ.12 కోట్ల దాకా పోగేసుకున్న ఓ వ్యక్తి అదను చూసి పరారయ్యాడు. దీంతో బాధితులు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే రమేష్ నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో మేధ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశాడు.

దీంతో పాటు అతను షేర్ మార్కెట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో పెట్టుబడి పెట్టటానికి పట్టణంలోని ప్రముఖ వ్యాపారుల యువకులను నమ్మించి లక్షల్లో తీసుకున్న డబ్బులకు నెలసరి వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. వచ్చిన లాభాల్లో కూడా పర్సంటేజీలు ఇస్తానని మరింత ఆశ పెట్టాడు. తెలిసిన వారితో పాటు ఉద్యోగులను, వారి బంధువులను కూడా ఈ ఉచ్చులోకి లాగాడు. ప్రారంభంలో వందకు రూ.5 వడ్డీ చెల్లించాడు. ఈ విషయం ప్రచారం కావడంతో చాలామంది లక్షల రూపాయలు అతనికి ఇచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి అతనికి రూ.2 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.

కొన్ని నెలలైన తరువాత అప్పులు ఇచ్చిన వారితో మరో ఒప్పందం చేసుకున్నాడు. వందకు రూ.10 వడ్డీ ఇస్తానని ఎవరి వద్దయినా తీసుకు రావచ్చన్నాడు. దీంతో చాలామంది బయట అప్పులు తెచ్చి రమేష్‌కు వడ్డీకి ఇచ్చారు. ఇలా జిల్లాలో రూ.12కోట్ల వరకు తీసుకున్నాడు. కొంతకాలం నుంచి అతడు వడ్డీ చెల్లించక పోవడంతో అతడిని నిలదీశారు. దీంతో కొంతమందికి చెక్కులు ఇచ్చాడు. అయినా, డబ్బులు ఇవ్వలేదు. పైగా మహబూబ్‌నగర్‌లో ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో బాధితులు అతడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు