వడగాడ్పులపై ప్రత్యేక ప్రణాళిక 

4 Mar, 2018 02:26 IST|Sakshi

ఉన్నతాధికారులతో సమావేశంలో సీఎస్‌ ఎస్‌కే జోషి 

సాక్షి, హైదరాబాద్‌: ఈ వేసవిలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమావేశం నిర్వహించారు. గత వేసవిలో 23 రోజుల పాటు వడగాడ్పులు వీచాయని ఈ సారి అంతకంటే ఎక్కువ రోజుల పాటు గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రతపై అధికార యంత్రాంగానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలను చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తగినన్ని ఓఆర్‌ఎస్, ఐడీ ఫ్లూయిడ్స్‌ తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్‌ అడ్వైజరీస్‌ విడుదల చేయాలన్నారు.  

వడగాడ్పుల తీవ్రతపై ప్రచారం.. 
సమాచార శాఖ ద్వారా వడగాడ్పుల తీవ్రతపై పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్స్, సోషల్‌ మీడియా, టీవీ, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎస్‌ ఆదేశించారు. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బందికి వేసవి ప్రణాళికపై శిక్షణనివ్వాలని సూచించారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో మంచినీటిని ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో మంచి నీరు, ఐస్‌ ప్యాక్‌లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ, అర్బన్‌ లోకల్‌ బాడీలకు సంబంధించి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలని సీఎస్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు