ముట్టుకుంటే భస్మమే! | Sakshi
Sakshi News home page

ముట్టుకుంటే భస్మమే!

Published Sun, Mar 4 2018 2:15 AM

CM KCR comments on Central government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎవరినైనా విమర్శించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని, ప్రధాన మంత్రిని విమర్శించకూడదని రాజ్యాంగంలో ఉందా అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, కొన్ని సందర్భాల్లో కొందరిని ముట్టుకుంటే భస్మమవుతారని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడతామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైంది. అనంతరం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘మాట్లాడితే జైలుకు పంపుతారా? 
ఒకాయనేమో ప్రధానమంత్రినే విమర్శిస్తారా? అంటున్నడు. ప్రధానమంత్రిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఇది ప్రజాస్వామ్యం. అవసరమని భావించినప్పుడు దేశంలో ఎవరినైనా సరే విమర్శించే అవకాశం ఇస్తది ప్రజాస్వామ్యం. కేసీఆర్‌కు జైలుకు పోవాలని ఉందా? అని ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతరు. అంటే జైలుకు పంపుతారా? దేశంలో మాట్లాడినోళ్లందరినీ జైలుకు పంపిస్తారా? ఇదేం రాజకీయం నాకర్థం కాదు. ఇదేమైన తానాషాహీనా? ఎవరినైనా సరే.. మేమేదో చేయగలం అనుకుంటే కష్టం. కొన్ని సందర్భాల్లో కొందరిని ముట్టుకుంటే భస్మమైతరు. ఏం జైలుకు వెళ్తరండి? నాకున్నదేంటి.. నేను జైలుకు వెళ్లేదేంటి? బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తమ పరిధిలో ఉండి మాట్లాడాలి. 

పిచ్చి పనులు చేసే అవసరం మాకు లేదు.. 
ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు చందాలిస్తరు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎలా నడుస్తాయో టీఆర్‌ఎస్‌ రాజకీయాలు సైతం అలానే నడుస్తాయి. ఆ సమయం వస్తే మాకు కూడా బోలెడు మంది సానుభూతిపరులున్నరు. పార్టీ సభ్యులే 70 లక్షల మంది ఉన్నరు. ఎన్నికల్లో పిచ్చి పిచ్చి పనులు చేసే అవసరం మాకు లేదు. మేము కడుపుగట్టుకొని, నోరు గట్టుకొని అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నం. ఈ ప్రధాన మంత్రే నాకు పది సార్లు కితాబిచ్చారు. దేశంలో కరెంట్‌ ప్రాజెక్టులు అంతా ప్రైవేటు వారికి ఇస్తే.. ఈయనొక్కరే బీహెచ్‌ఈఎల్‌కి ఇచ్చిండని పొగిడిండు. ఇక మేం చేసిన కుంభకోణం ఏంటి.. ఎవరూ మమ్మల్ని ఏమీ చేయలేరు. అంత నిటారుగా ఉన్నం. 

అనకున్నా.. అన్నట్లు చిత్రీకరించారు.. 
ప్రధానమంత్రి గారినో లేక మరొకరినో తూలనాడిన అని మాట్లాడుతున్నరు. అది వంద శాతం శుద్ధ తప్పు. దానిని ఖండిస్తున్న. లేనిదానిని ఉన్నట్లు చిత్రీకరించారు. నేను అనలేదు. నిజంగానే అన్నానా? అని టేప్‌ తెప్పించుకుని చూసిన. ప్రధాన మంత్రి గారికి అని, మోదీ గారికి అని స్పష్టంగా చెప్పినట్లు ఉంది. దాన్ని ‘గాడికి’అన్నట్లు మాట్లాడుతున్నరు. ఇక నేనేం చెప్పలేను. ప్రధాన మంత్రిని మేమే కించపర్చుకుంటమంటే మీ ఖర్మ తప్ప మేమేం చేసేది లేదు. నాకు వ్యక్తిగతంగా మోదీతో పంచాయితీ లేదు. ఆయనంటే గౌరవం ఉంది. మోదీ, నేను మంచి స్నేహితులం. మధ్యలో ఉన్నవారే పరేషాన్‌ అవుతుండ్రు. నేను మాట్లాడిన సంద ర్భం వింటే ప్రతి ఒక్కరికి సులువుగా అర్థం అవుతుంది. అక్కడ ‘గాడు’లాంటి మాటను అనాల్సిన అవసరం కూడా లేదు. రెండు సందర్భాల్లో వాడు వీడు అని పదజాలం మాట్లాడిన. మోదీ గారిని కాదు. ఒక సందర్భంలో.. కేంద్ర ప్రభుత్వం లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా.. 70 ఏళ్లలో వీరు చేసిందేమీ లేదన్న. ఇదే పాత చింతకాయ పచ్చడి తప్ప మరేం రాదని చెప్పిన. ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్న. ఆ విషయంలో నా వైఖరిలో మార్పు లేదు. 

రాజకీయాల గురించి మాట్లాడిన.. 
తర్వాత వాడు వీడు అనే పదాన్ని ఏపీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడిన. నేను చెప్పిందేమిటంటే.. 30 ఏళ్లుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్న. అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న. టీడీపీ అధికారంలో ఉంటే అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ వాడు జొన్న కంకులు, ఎండిపోయిన వరి నార్లు, కందులు తీసుకొచ్చిన్రు.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాడు తీసుకొచ్చిండు.. వీడు అధికారంలో ఉంటే వాడు తెచ్చిండు.. వాడు అధికారంలో ఉంటే వీడు తెచ్చిండు.. కానీ పల్లెల్లో మాత్రం కరెంట్‌ ఇవ్వలేదు. అదొకటి గులాబీ జెండా మాత్రమే తెచ్చిందని చెప్పిన.. అంతకు మించి ఎవరిని దూషించలేదు. దూషించే అలవాటు నాకు లేదు. తెలంగాణలో రోజూ ప్రజలు మాట్లాడే సాధారణ భాషే మాట్లాడిన. లేని రావత్తులు, కావత్తులు పెట్టి సంస్కృతాలు మాట్లాడడం నావల్ల కాదు. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సింపుల్‌ వ్యవహారిక భాషలో మాట్లాడుతం. మీ కోసం నా భాష మార్చుకోను. మార్చుకోవాల్సిన ఖర్మ నాకు లేదు 

గంట గంటకు దృష్టి సారించుకొమ్మనండి 
నిర్మలా సీతారామన్‌ వచ్చి ఇకపై తెలంగాణపై దృష్టిసారిస్తదంటరు. ఎవరు వద్దన్నరు. నాకర్థం కాదు. ఎవ్వరైనా ఆగబట్టినరా? ఇప్పటిదాక ఎవరో ఆగబట్టినరట.. బతిమిలాడారట.. దృష్టి రోజూ సారించుకొమ్మనండి. గంట గంటకు సారించుకొమ్మనండి. ఇదో పెద్ద జోక్‌. 

ఒక సర్వేలో 106.. ఇంకో సర్వేలో 103 
సర్వేలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోసం చేయించినమా? మా కోసం మేం చేయించుకున్నం. మా పొజిషన్‌ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ప్రజలు మమ్మల్ని, మా పార్టీని, మా నాయకులను ఏం అనుకుంటున్నరో తెలుసుకోవడానికి చేసుకున్నం. రెండు సర్వేలు చేయించుకున్నం? రెండు సర్వేలు కలిపి ఆరున్నర లక్షల శాంపిల్స్‌. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల మందితో సర్వే జేసినం. ఒక సర్వేలో 106 గెలుస్తామని, మరోక దాంట్లో 103 గెలుస్తమని వచ్చింది. నేనేం జేయాలె దానికి. ఒకాయనేమో నేను సన్యాసం తీసుకుంట అంటడు. నువ్వు సన్యాసం తీసుకుంటే మాకేంటి? 

పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నరు 
కాంగ్రెస్‌ వారికి మెంటల్‌ కేసు ఉంది. వారి నిరాశ, నిస్పృహలను ప్రజలకున్నట్లు భావించుకుని పిచ్చి ప్రేలాపనలు చేసుకుంటూ పోతున్నరు. వారి బస్సు యాత్రకు ఐదారు వేల మందికి మించి రావట్లేదు. వీరి వెంబడిపోయినోళ్లే సగం మంది ఉన్నరు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 23 జిల్లాలపై రూ.1.19 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తే.. కేవలం నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో 10 జిల్లాల్లో మేం రూ.1.15 లక్షల కోట్ల వ్యయం చేశాం. మేం చేస్తున్న పనులన్నీ ప్రజలకు తెలుసు.

కేసీఆర్‌ ఎవరికీ భయపడడు.. 
మాకున్న ఆస్తులుగానీ తోకలు గానీ అంతా బహిరంగమే. మా కుటుంబం కలిసి ఇంతకు మించి ఆస్తులు వద్దని తీర్మానం కూడా చేసుకున్నం. దుర్మార్గమైన ఆస్తులు, సంపాదన అక్కర లేదని అనుకున్నం. కాబట్టే మాకు ఎంత ఉందో ఎప్పటికప్పుడు నికరంగా నా జేబుకు ఉండే పెన్నుతో సహా ప్రతి సంవత్సరం ఐటీ లెక్కలు సమర్పిస్తున్నం. మేం సన్నాసులం కాదు. ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తం. దాని ప్రకారమే కచ్చితత్వంతో ఉన్నం. అంతకు మించి మమ్మల్ని ఎవరూ ఏం చేయగలిగింది లేదు. దొంగ పనులు, తప్పు పనులు, కుంభకోణాలు చేసినోళ్లు, అక్రమ సంపాదన చేసుకున్నోళ్లు భయపడుతరు. కానీ కేసీఆర్‌ భయపడడు. మేం భయపడం. ఆ అవసరంలేదు కేసీఆర్‌కు. ముట్టుకుంటే తెలుస్తుంది కథేంటో.. 

చాలెంజ్‌..కాంగ్రెస్‌ 10 సీట్లు దాటదు 
కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సర్కస్‌ ఫీట్లు చేసినా 2019 ఎన్నికల్లో 10 సీట్లు దాటదు. నేను చాలెంజ్‌ చేస్తున్న. అది కూడా మేం పట్టించుకోకపోతనే. బీజేపీ మొత్తం గల్లంతయ్యే పరిస్థితి. ఉన్న సీట్లు వస్తే చానా గొప్ప. బీజేపీకి తెలంగాణలో ఉన్న సీట్లు ఎన్ని? అసలు ఆ పార్టీ తెలంగాణలో ఉందా? పెద్ద జోకు కాకపోతే? మేమే ప్రత్యామ్నాయమని లక్ష్మణ్‌ అప్పుడప్పుడు పెద్ద జోకులు మాట్లాడుతారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో అమెరికా నుంచి బీజేపీ తరఫున డాక్టర్‌ దేవయ్యని పెట్టారు. మాకు 4.60 లక్షల మెజారిటీ వచ్చింది. బీజేపీ పార్టీని మేం రాజకీయ పార్టీగా పరిగణించం.  

కేంద్రంపై పోరాడతాం.. నిలదీస్తాం..
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అమలు కాలేదు. వాటిపైనే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, పోరాటం చేయాలని అనుకున్నం. చాలా సందర్భాల్లో దరఖాస్తులు ఇచ్చినం. ప్రతినిధి బృందాల రూపంలో వెళ్లి చెప్పినం. మా పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ నాయకులు సైతం వెళ్లి మాట్లాడారు. మంత్రులు కూడా వెళ్లి చెప్పారు. కానీ ఆశించిన ప్రతిస్పందన రాలేదు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయాన్ని ప్రధానికి స్వయంగా నేనే చెప్పడం జరిగింది. 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం వద్ద పెట్టుకోవడం సరికాదు. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి కేంద్రానికి పంపించినం. దానిపైనా స్పందన లేదు. ఈ విషయంలో పాత పద్ధతిని యథాతథంగా కొనసాగిస్తామన్నది కేంద్రం అభిప్రాయం. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం చేస్తాం. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా రాజ్యాంగ సవరణ చేయవచ్చు. రాజ్యాంగ సవరణకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది.

కేంద్రం అనుకుంటే ఆర్టికల్‌ 16ను సవరించేందుకు అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ చేస్తే అన్ని రాష్ట్రాలు మద్దతిస్తాయి. కానీ ఈ విషయంలో కేంద్రం పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పునర్విభజన చట్టం హామీ మేరకు రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాలని లోక్‌సభలో పోరాడతాం. రెండు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలిస్తామని చెప్పి ఏం ఇవ్వలేదు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ఇస్తున్న విధంగా ఇస్తేనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తాయి. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మా పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు గత బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీలు ఎయిమ్స్, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదీస్తాం. 

అదనంగా ఇచ్చింది ఒక్క రూపాయి లేదు 
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక రూపాయి ఇచ్చింది లేదు. రాజ్యాంగం ప్రకారం పన్నుల వాటాతోపాటు ఆర్థిక సంఘం నిధులు కలిపి నాలుగేళ్లలో రూ.81,362 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే నాలుగేళ్లలో తెలంగాణ నుంచి అంతకు నాలుగు రెట్లు పన్నులు కేంద్రానికి వెళ్లాయి. మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్‌ కాకతీయలకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం నాలుగేళ్లలో రూ.23 వేల కోట్లే ఇచ్చారు. మా హక్కు కోసం పోరాడతాం.

12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు 
ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు చెప్పారు. 14, 15న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  

Advertisement
Advertisement