1.572 % డీఏ పెంపు

4 Sep, 2018 01:41 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపు 

ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం 

జనవరి 2018 నుంచి వర్తింపు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక విడత కరువుభత్యం (డీఏ) చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నాయి. పెంచిన డీఏ బకాయిలను జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌)తో కలిపి అక్టోబర్‌ 1న చెల్లించే సెప్టెంబర్‌ వేతనంలో నగదుగా చెల్లించనున్నారు. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 27.24 శాతానికి చేరుకుంది. తాజా డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.350 కోట్ల అదనపు భారం పడనుంది. 

జూలై డీఏ ఎప్పుడో? 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏటా జనవరిలో, జూలైలో డీఏలను పెంచుతాయి. కేంద్రం పెంచిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు రెండుసార్లు డీఏ చెల్లిస్తుంది. జూలై డీఏను పెంచుతూ ఆగస్టు 29న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ డీఏ మంజూరులో ఈసారి జాప్యం జరిగింది. 2017 జూలై డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 17న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు సైతం 1.572 శాతం పెంచింది. 2018 జనవరి డీఏ పెంపుపై తాజాగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2018 జూలై డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై డీఏ పెంపు ఎప్పుడనే దానిపై స్పష్టత రావట్లేదని ఉద్యోగులు చెబుతున్నారు. అసెంబ్లీకి ముందుస్తు ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉంటే రెండు విడతల డీఏలను కలిపి ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు