లాక్‌డౌన్‌ సడలిస్తే కష్టమే..!

18 Apr, 2020 01:59 IST|Sakshi

రాష్ట్రంలో ఇంకా తగ్గని కరోనా కేసులు 

సడలింపులిస్తే లక్షల మంది బయటకు వస్తారని

ప్రభుత్వ వర్గాల ఆందోళన

మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించడమే మేలని అభిప్రాయం

రేపటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అమలవుతున్న కరోనా లాక్‌డౌన్‌ శనివారంతో 28వ రోజుకు చేరుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్‌ కేసులు బయటపడిన ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి కట్టుదిట్టంగా చర్యలు చేపడుతుండటంతో వైరస్‌ ప్రమాదకర మూడో దశకు చేరుకోనప్పటికీ సగటున రోజూ 30 నుంచి 50 కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించినట్లుగా ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితులు ఒక్కసారిగా చేజారే ప్రమాదముందని ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానుంది.

మే 3 వరకు లాక్‌డౌన్‌ను యథాతథంగా కొనసాగించాలా లేక కేంద్రం సూచించినట్లుగా సడలింపులు ఇవ్వాలా అనే విషయమై కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం, అనుబంధ రంగాలు, అత్యవసర, నిత్యావసర సేవల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సడలింపులకు అదనంగా కొత్త సడలింపులను అమలు చేసేందుకు అవకాశం లేదని ఉన్నతస్థాయి అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఒకవేళ సడలింపులిస్తే ఇన్నాళ్లూ పాటించిన లాక్‌డౌన్‌ వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  చదవండి: 57 వేల అర్జీలు.. 33,500 పరిష్కారం

లక్షల మంది బయటకొస్తే పరిస్థితి ఏంటి?
ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని సడలింపులను ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తే లక్షల మంది మళ్లీ రోడ్లపైకి వచ్చే ప్రమాదం నెలకొంది. అన్ని వస్తువుల రవాణా, ఐటీ, అనుబంధ రంగాల సేవలు, బ్యాంకులు, బీమా, ఈ–కామర్స్‌ కార్యకలాపాలు, గ్రామీణప్రాంత పరిశ్రమలు, సెజ్‌లలోని పరిశ్రమలు, ఎగుమతులు చేసే పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌లు, కార్పెంటర్లు, ఐటీ రిపేర్‌ వర్కర్లు, హైవే దాబాలు వంటి తదితర సేవలు ఏప్రిల్‌ 20 నుంచి నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ సవరించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 30 లక్షల మంది ఈ రంగాల్లో ఉద్యోగం, ఉపాధి పొందుతున్నట్టు అంచనా.

ఐటీ, అనుబంధ రంగాలను ఉదాహరణగా తీసుకుంటే హైదరాబాద్‌లోని 1,500 ఐటీ, అనుబంధ కంపెనీల్లో ప్రత్యక్షంగా 5.4 లక్షల మంది, పరోక్షంగా 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి. ప్రస్తుతం 95 శాతం ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు ఇళ్ల నుంచే పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో 1,63,302 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉండగా వాటిలో 9,80,520 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్‌తోపాటు తమ పరిశ్రమలకు సమీపంలో ఉన్న ఇతర పట్టణాల్లో నివసిస్తున్నారు. ఐటీ, అనుబంధ రంగాలు, గ్రామీణ పరిశ్రమలతోపాటు ఇతర రంగాల కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తే తప్పనిసరిగా ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని యాజమాన్యాలు కోరే అవకాశముంది.

ఇలా ఒక్కసారిగా లక్షల మంది ఉద్యోగులు విధులకు హాజరైతే వారిని నియంత్రించడం పోలీసులకు సైతం సాధ్యం కాదని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సడలింపులను సాకుగా చూపి ఇతర అనుమతించని పనుల కోసం లేదా పనిలేకున్నా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్ణయించిన మేరకు మే 3 వరకు రాష్ట్రంలో యథాతథంగా లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆలోగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడితే దశల వారీగా సడలింపులను అమలు చేయవచ్చని కొందరు అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ఆ మందులు ఎవరెవరు కొన్నారు?

గణాంకాలు కీలకం..
రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదవగా మార్చి 14 నుంచి 30 వరకు రోజువారి కేసుల సంఖ్య దాదాపుగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. కేవలం మార్చి 27, 31 తేదీల్లోనే రెండంకెల కేసులు నమోదయ్యాయి. అయితే ఏప్రిల్‌ 1 నుంచి మాత్రం రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజూ 30–50 పాజిటివ్‌ కేసులు బయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఈ గణాంకాలే కీలకం కానున్నాయి. మార్చి 31 నాటికి రాష్ట్రంలో వెలుగు చూసినమొత్తం కేసుల సంఖ్య 91కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో.. అంటే ఏప్రిల్‌ 3 నాటికి కేసుల సంఖ్య అనూహ్యంగా 223కి చేరింది. అలాగే ఏప్రిల్‌ 13 నాటికి 9 రోజుల్లో 462కి చేరింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ సడలింపులకు ఏమాత్రం ఆస్కారం లేదని ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు