ఇక్కడే ఉండండి

18 Apr, 2020 02:15 IST|Sakshi
కాళ్లకల్‌ వద్ద కాలినడకన వెళ్తున్న కార్మికులతో మాట్లాడుతున్న హరీశ్‌

వలస కార్మికులకు మంత్రి హరీశ్‌రావు భరోసా  

స్వరాష్ట్రాలకు వెళ్తున్న కార్మికులకు పరామర్శ  

సాక్షి, మెదక్‌: వలస కార్మికులెవరూ సొంతూర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో జాతీయ రహదారిపై చిన్న పిల్లలతో కలసి కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను చూసి అటుగా వెళ్తున్న మంత్రి తన వాహనాన్ని ఆపారు. కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి, సరైన ఆహారం లేకపోవడంతోనే తాము హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు వెళ్తున్నామని చెప్పడంతో హరీశ్‌ చలించిపోయారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లొద్దని, అన్ని రకాల సాయం అందించి ఆశ్రయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

తెలంగాణకు పొట్టకూటి కోసం వలస వచ్చిన ఏ ఒక్క కూలి ఆకలితో బాధ పడకూడదనే ప్రభుత్వం ప్రతి కార్మికుడికి 12 కిలోల ఉచిత బియ్యం, రూ. 500 నగదును అందజేసిందన్నారు. రైతులు  ఇబ్బందులు పడకూడదనే  గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.టోకెన్ల ప్రకారమే రైతులు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. అంతకు ముందు  మనోహరాబాద్‌ మండల పరిధిలోని రామాయంపల్లి, మెదక్‌ శివారులోని పిల్లికోటల్‌లో గల డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్న వలస కార్మికులకు ఒక్కొక్కరికి రూ.500 నగదు, 12 కిలోల బియ్యాన్ని అంజేశారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో, మెదక్‌ మండలం ఖాజీపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు