శాతవాహనకు మళ్లీ నిరాశే..!

2 Jul, 2019 08:53 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : డిగ్రీ సీట్ల కేటాయింపు మూడో దశలోనూ నిరాశే మిగిల్చింది. జూన్‌ 30న మూడో దశ సీట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 3,438 సీట్లు కేటాయించగా సీట్ల భర్తీ శాతం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపుల్లో ఆశించనంతంగా సీట్ల భర్తీ కాలేదు. మూడో దశపైనే ఆశలన్నీ పెట్టుకోగా.. ఆశించినంత సీట్ల భర్తీ కాక ప్రైవేటు యాజమాన్యాలు తల పట్టుకున్నారు. గత సంవత్సరం కంటే కూడా తక్కువగా భర్తీ అవుతుండడంతో ఆవేదన మొదలైంది.

ప్రభుత్వం ఆది నుంచి డిగ్రీలో ప్రవేశాలు పెంచాలని వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంప్రదాయ కోర్సులతోపాటు వివిధ నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఏంచేసినా సీట్ల భర్తీ శాతం పడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియక తికమక పడుతున్నాయి. ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువశాతం మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుపై ఆనాసక్తి కలిగి ఉండడంతో నూతన మార్గాలతోపాటు బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు వెళ్లడానికి మార్గాలు అన్వేషించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గతంలో సీట్ల నిండకుంటే దాదాపు 5 దశల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇప్పటికి మూడు దశలు పూర్తయినా పెద్దగా సీట్ల భర్తీ కాలేదు. దీనివల్ల ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఇంకా ఒకటి రెండు దశలు పెట్టే అవకాశాలు లేకపోలేదని విద్యారంగనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రవేశాలు చేపడితేనే సీట్ల భర్తీ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మూడు దశల్లో అంతంతే...
దోస్త్‌ ద్వారా డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు ఇప్పటికి మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు కూడా  జూన్‌ 30 సాయంత్రం జరిగింది. మొదటి దశలో 12,354 సీట్లు కేటాయించగా.. 5,126 సీట్లు నిర్ధారించుకున్నారు. రెండో దశలో 4,881 సీట్లు కేటాయించగా ఇందులో బాలురు 1,872, బాలికలు 3,009 ఉన్నారు. మూడో దశలో 3,438 సీట్లు కేటాయింపు జరగడంతో శాతవాహన యూనివర్సిటీలో మొత్తం సీట్లలో సగం కూడా కాకపోవడం గమనార్హం. ఏటేటా కూడా ప్రవేశాలు కూడా నేలచూపే చూస్తున్నాయి. మూడో దశలో సీట్లు కేటాయించిన వారు జూలై 1 నుంచి 4 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేసుకొని కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి గడువుంది. మరో అవకాశమిస్తే వివిధ కారణాల వల్ల సీట్లు పొందని వారు, నమోదు చేసుకోని వారితో ఖాళీ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది.   

సగం కూడా భర్తీకాలేదు..
శాతవాహన యూనివర్సిటీ 3 దశలు సీట్ల కేటాయింపు తర్వాత చూస్తే మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు.  యూనివర్సిటీ వ్యాప్తంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,820 సీట్లున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో కలుపుకొని 1,230 సీట్లున్నాయి. వీటికి దోస్త్‌ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి పోగా మిగిలిన 42,040 సీట్లు దోస్త్‌ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 12,355 సీట్లు, 2వ దశలో 4,881 సీట్లు, 3వ దశలో 3,438 సీట్లు కేటాయించారు. మొత్తం 42,040  సీట్లకు మూడు దశల్లో కలుపుకొని 20,677 సీట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా ఇందులో కేటాయించబడిన వారందరూ సీట్లు నిర్ధారించుకుంటారో లేదో తెలియదు. అంటే ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది.  

తల పట్టుకుంటున్న  యాజమాన్యాలు...
యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమానులు సీట్లు నిండక తల పట్టుకుంటున్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన నాటి నుంచి పలు కళాశాలలు తీవ్రమైన ప్రచారాలు, ప్రలోభాలు చేస్తూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్లు మాత్రం భర్తీ కాలేదు. దాదాపు రెండు మూడు నెలల నుంచే లక్షల్లో ఖర్చు చేస్తూ క్యాన్వేసింగ్‌ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. మరికొన్ని కళాశాలల పరిస్థితి కొనసాగించే బదులు మూసుకుంటేనే మంచిదనే ఆలోచనలో యాజమాన్యాలున్నట్లు తెలిసింది.

కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ప్రముఖ కళాశాలల్లో మాత్రమే సీట్లు చెప్పుకునే స్థాయిలో నిండినట్లు సమాచారం. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టే కళాశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలావరకు కళాశాలలు నిరాశతోనే ఉన్నాయని, సీట్ల భర్తీకి కొట్టుమిట్టాడుతూ కష్టాలతోనే నెట్టుకొస్తున్నాయని సమాచారం. ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల సంఖ్య కూడా తగ్గుతుందని, స్వచ్ఛందంగా కళాశాలలు మూతబడే పరిస్థితులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆచార్యడొకరు తెలిపారు. ఏదేమైనా ప్రవేశాలకు గతంలో వలే మరో అవకాశమిస్తేనే ఇంకొన్ని సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగనిపుణుల విశ్లేషణ.  

మరిన్ని వార్తలు