ఎందుకు చేశావ్‌ ఈ పని? | Sakshi
Sakshi News home page

లంచం తీసుకున్న వీఆర్వోపై ఎమ్మెల్యే ఆగ్రహం

Published Tue, Jul 2 2019 8:54 AM

VRO Suspended For Take Bribe From Former In Guntur - Sakshi

సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : ‘పిత్రార్జితం ద్వారా సంక్రమించిన ఎకరంన్నర పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఇచ్చేందుకు వీఆర్వో పుల్లయ్య రూ.50 వేలు లంచం అడిగాడు. గత్యంతరం లేని స్థితిలో రూ.50 వేలు ఇచ్చి వెంటనే పనిచేసి పెట్టమన్నాను. ఏడాదిన్నరగా తిప్పుకుంటూ భూమిని ఆన్‌లైన్‌ చేయించకపోగా, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా ఇవ్వలేదు’  అంటూ అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకుంది. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు.

పెదపాలెంకు చెందిన తురకా రామకోటమ్మ అనే మహిళా రైతు చాలా ఆవేదనతో ఎమ్మెల్యే వద్దకు వచ్చి తన గోడు వినిపించింది. అప్పు చేసి మరీ వీఆర్వో పుల్లయ్యకు రూ.50 వేలు ఇచ్చానని తెలిపింది. చలించిన ఎమ్మెల్యే శంకరరావు వెంటనే వీఆర్వో పుల్లయ్యను పిలిపించారు. ‘ఎందుకు చేశావ్‌ ఈ పని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సార్‌.. ఎలక్షన్‌ కోడ్‌ రావడం వల్ల ఆన్‌లైన్‌ చేయలేకపోయా. పాస్‌ పుస్తకం ఇవ్వలేకపోయా’నని వీఆర్వో సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. ‘లంచం తీసుకున్నావా. లేదా’ అని ఎమ్మెల్యే నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. రెండు రోజుల్లో ఆమె భూమిని ఆన్‌లైన్‌ చేయించి పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని, రూ.50 వేలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.  లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మరికొందరు వీఆర్వోల అవినీతి, అక్రమాలనూ పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

వీఆర్వో పుల్లయ్య సస్పెండ్‌
పట్టాదారు పాసుపుస్తకాల కోసం వచ్చిన ఒక మహిళ వద్ద రూ.50 వేల లంచం తీసుకుని యేడాదిన్నర కాలంగా తిప్పుకున్న వీఆర్వో పుల్లయ్యను జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అచ్చంపేట తహసీల్దార్‌ రాంభూపాల్‌రెడ్డి సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. 

Advertisement
Advertisement