నారాయణపేటను జిల్లా చేయాలి

5 Oct, 2016 01:50 IST|Sakshi

జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా సాధన కోసం ఈ నెల 5 నుంచి నిర్వహించే 48 గంటల బంద్‌లోను, 6న మరికల్‌లో జరిగే హైవే దిగ్బంధంలో సకలజనులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
 
ఎమ్మెల్యే రాజీనామా లేఖ
నారాయణపేటను జిల్లాగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు.

మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలి
మక్తల్: మక్తల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కాగా, మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  
 
సెల్‌టవరెక్కిన ఇద్దరు యువకులు
చేగుంట: మెదక్ జిల్లాలోని నార్సింగిని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జెట్టి శ్రీనివాస్, మైలారం రాజులు మంగళవారం సెల్‌టవర్ ఎక్కారు. ఇప్పటికే నార్సింగి మండలం కోసం గ్రామానికి చెందిన అంచనూరి రాజేశ్, మల్లాగౌడ్ , సిద్దారెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామానికి చెందిన సందీప్ ఒంటిపై కిరోసిన్  పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల ఏర్పాటుపై ప్రకటన వచ్చే వరకు టవర్ దిగమని యువకులు తెలిపారు.

మరిన్ని వార్తలు