పునరుజ్జీవన వ్యయం డబుల్‌!

3 Dec, 2019 03:11 IST|Sakshi

ఏడాదిన్నరలో అంచనాలు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు.. 

ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేయనున్న నీటి పారుదల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ను వరద కాల్వ మీదుగా ఎస్సారెస్పీకి పంపేందుకు తలపెట్టిన పునరుజ్జీవన పథకం వ్యయంరెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్ల నుంచి సుమారు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు సిద్ధమవగా, ప్రభుత్వ అనుమతి కోసం వెళ్లనుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017, జూన్‌ 17న ప్రభుత్వం రూ.1,067 కోట్లతో అనుమతులిచ్చారు. ఈ నిధులతో 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లను ప్రతిపాదించారు.

వీటి నిర్మాణాలకు మొదట 5.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ అవసరం ఉండగా.. నిర్మాణ పనుల్లో మార్పుల కారణంగా అది 6.14 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. స్టీల్‌ అంచనా 17,100 టన్నులకు పెరిగింది. దీంతో తొలుత వేసిన అంచనా వ్యయాన్ని ఈ ఏడాది జూన్‌లో రూ.1751.46 కోట్ల మేర పెంచుతూ నిర్ణయం జరిగింది. వీటి తర్వాత అదనంగా 2 తూముల, కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు, సిమెంట్, స్టీలు, ఇంధన ధరలో మార్పులతో గతంలోనే రూ.62.68 కోట్ల మేర అంచనా పెరగ్గా, ప్రస్తుతం అది 135.94 కోట్ల మేర పెరనున్నట్లు ఇంజనీర్లు నిర్ధారించారు. మొత్తం అంచనా వ్యయం రూ.1999.56 కోట్లకు పెరగనున్నట్లు తేల్చారు. దీన్ని స్టేల్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు