అర్హులకు ‘ఆసరా’ ఇవ్వడంలేదు

10 Nov, 2014 11:10 IST|Sakshi

కమాన్‌చౌరస్తా : అర్హులందరికీ ఆసరా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పేదరికాన్ని అర్హతగా తీసుకుని పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో ఉన్నవారి పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా గ్రామాల్లో అందరికీ రూ.1.5 లక్షల లోపు ఆదాయం ఉంటుందని వారిని అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందని, ఒక్కో ఇంటికి రూ.3.5 లక్షలు ఇస్తే నియోజకవర్గానికి 240 నుంచి 245 ఇళ్లు నిర్మించే అవకాశం ఉందన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 11 శాతం జనాభానే సూచించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్ కుమార్, నాయకులు అంజన్‌కుమార్, నిఖిల్ చక్రవర్తి, పోతారపు సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు