రాజధాని పేరుతో నిండా ముంచారు | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో నిండా ముంచారు

Published Thu, Apr 12 2018 2:18 AM

YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Undavalli - Sakshi

అసైన్డ్‌ భూములు కోల్పోయిన దళితులు నావద్దకు వచ్చి ‘అన్నా.. చంద్రబాబు ఎవరన్నా మా భూములు లాక్కునేందుకు? అసైన్డ్‌ భూములపై ఆయన పెత్తనం ఏంటన్నా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మాకిచ్చిన తర్వాత ఆ భూములు మావి కావా? అని దళితులు, పేదలు అడుగుతున్నారు. అన్నా.. లంక భూములకు, అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ రాదని.. ల్యాండ్‌ పూలింగ్‌లో నోటిఫై చేయించి తీసుకుంటారని మంత్రులు, టీడీపీ నాయకులు, ఉద్యోగస్తులు బెదిరించి ఆ భూముల్ని కారు చౌకగా రూ.10లక్షలు – రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ భూములకూ వాళ్లు ప్యాకేజీ తీసుకుంటున్నారని ఆ బాధిత రైతులు చెబుతుంటే బాధనిపించింది. 
 
ముఖ్యమంత్రి కళ్ల ఎదుటే పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం తదితర గ్రామాలలో ఇసుక రీచ్‌ల్లో నుంచి వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుక తరలిస్తున్నారని రైతులు చెప్పారు. సీఎం సమక్షంలోనే జరుగుతున్న ఈ ఇసుక మాఫియా దందాకు డాన్‌ ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ముఖ్యమంత్రే. ఆయన గారి ఆఫీసుకు కిలోమీటర్‌ దూరంలో ఇంతగా దందా సాగుతున్నా ఆయన గారు పట్టించుకోలేదంటే అవినీతి, లంచాలు ఏస్థాయికి చేరాయో అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు మొదలు మంత్రులు, చినబాబు, పెదబాబు వరకు అందరికీ లంచాలే లంచాలు. ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆస్తులు కాపాడేవాడా? దోచుకునే వాడా? అని రైతులు అడుగుతున్నారు. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాజధాని కోసం లంక భూముల్ని, అసైన్డ్‌ భూముల్ని గుంజుకునే అధికారం ఎక్కడిదని చంద్రబాబుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏటా నాలుగు పంటలు పండే సారవంతమైన భూముల్ని లాక్కుని ముష్టి వేసినట్టు వెయ్యి గజాలు ఇస్తారా? అని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల వారిని చంద్రబాబు నిండా ముంచార ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 134వ రోజు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

రూ.52 కోట్ల ఈవెంట్‌.. రూ.30 కోట్ల లంచాలు.. 
‘‘రాజధాని ప్రాంతంలో అడుగులు వేస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలు చెబుతున్న బాధలు వింటుంటే గుండెలు తరుక్కుపోయాయి. నా వద్దకు ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌ వచ్చి ‘అన్నా.. చంద్రబాబు హ్యాపీ సిటీస్‌ (సంతోష నగరాలు) అంటూ మూడు రోజుల పాటు 110 మున్సిపాలిటీలలో ఒక కార్యక్రమం చేపడుతున్నారన్నా.. ఆ కార్యక్రమానికి రూ.52 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నా’ అని చెప్పారు. ఒకవైపు డబ్బులు లేవు.. కేంద్రం ఇవ్వడం లేదంటాడు. మరోవైపు కన్సల్టెన్సీలకు, ఈవెంట్‌ మేనేజర్లకు కోట్లు కట్టబెట్టి లంచాలు తీసుకుంటున్నారు. సంతోష నగరాల పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో రూ.30 కోట్ల లంచాలు ఎలా తీసుకుంటారన్నా.. అని ఆ కార్పొరేటర్‌ ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలకు ట్యూషన్లు చెప్పించేందుకు బయటి నుంచి నలుగుర్ని తెప్పించి వారికి కోట్లు కట్టబెట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఇది విన్నప్పుడు ఆ కార్పొరేటర్‌కున్న బుద్ధి, చిన్నపాటి ఆలోచన కూడా సీఎంకు లేకపోవడం బాధనిపించింది.  

హోదాను తాకట్టు పెట్టేశారు.. 
రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే మార్గం ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు హోదా కోసం ప్రయత్నం చేయలేదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధానిని గట్టిగా అడిగితే హోదా వచ్చి ఉండేది. ఇవాళ హోదా ఎండమావిగా తయారవ్వడానికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం అని చెప్పడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ప్రత్యేక హోదాపై అన్యాయం చేసిన తీరు చూడండి. మన ఎంపీలు కేంద్రానికి మేలు కొలుపు కలగాలని, బుద్ధి రావాలని తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టారు. చిత్తశుద్ధి ఉన్న పెద్దమనిషయితే తన ఎంపీలతో కూడా రాజీనామా చేయించే వారు. దీక్షలకు కూర్చోబెట్టేవారు.

రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్షకు దిగి ఉంటే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేది కాదా? నరేంద్ర మోదీ దిగి వచ్చి హోదా ఇచ్చేవారు కాదా? చంద్రబాబు తీరు చూస్తుంటే నాకో విషయం గుర్తుకువస్తోంది. యుద్ధానికి ఓ సైనికుడు తుపాకీతో వెళ్లాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. అప్పుడా సైనికుడు తన చేతిలోని తుపాకీ ట్రిగ్గర్‌ నొక్కాడు. అయితే గుండు బయటకు రాలేదు. చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదా? తన ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేసి ఉంటే తుపాకీ పేలి ఉండేది.. గుండు బయటకు వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా మన కాళ్ల వద్దకు వచ్చి ఉండేది. కానీ పూటకో మాట మాట్లాడే వ్యక్తి మనకు సీఎంగా ఉండ డం సిగ్గుచేటు’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

సభలో అలజడికి టీడీపీ కార్యకర్తల యత్నం 
పాదయాత్రలో జగన్‌కు వస్తున్న స్పందన చూసి ఉండవల్లి సభలో అలజడి రేపేందుకు టీడీపీ నేతలు కొందరు కార్యకర్తలను ఉసిగొల్పారు. సుమారు 20 మందికిపైగా యువకులు కోడిగుడ్లు, టమాటాలతో సభకు వచ్చారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగి తమ జోలికి వస్తే ఏమవుతుందో తెలుసుగా అంటూ బెదిరింపులకు దిగారు. ఏ మంత్రితో మాట్లాడమంటారు.. అంటూ సెల్‌ఫోన్లు తీసి హడావిడి చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడుతుండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement