ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ

13 Sep, 2019 02:25 IST|Sakshi

33 జిల్లాల నిమజ్జనాన్ని పర్యవేక్షించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 35 వేల మంది పోలీసులతో పకడ్బందీగా నిమజ్జనం నిర్వహించారు. పాతబస్తీ, బాలాపూర్, ఖైరతాబాద్‌ శోభాయాత్రలు ప్రశాంతంగా సాగడంలో సీనియర్‌ ఆఫీసర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

33 జిల్లాల్లో ప్రతి నిమజ్జనం పాయింట్‌ను లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు.  అంతకుముందు ఏరియల్‌  సర్వే ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్‌ అలీతో కలిసి డీజీపీ శోభాయాత్రను పర్యవేక్షించారు.   ‘పోలీసు అధికారులు, సిబ్బంది ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. వారికి అప్పగించిన పనులను పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. ప్రతి ప్రాంతంలో గణేశ్‌ మండపాల నిర్వాహకులను భాగస్వాములను చేసి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడంలో సఫలీకృతులయ్యారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 
 

>
మరిన్ని వార్తలు