జెడ్పీలో జగడం !

15 Dec, 2014 02:16 IST|Sakshi

పాలమూరు: జిల్లా అభివృద్ధి పనులను విస్మరిస్తూ.. రాజకీయ విభేదాలకు వేదికగా.. పరస్పర విమర్శలకు తావిస్తూ ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ర సాభాసగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలి వాదనలు, వాదోపవాదోలతో సభ పక్కదారి పట్టింది. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, కాంగ్రెస్, ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు అభివృద్ధి పనులకోసం నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శించారు.
 
 ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజెండాలోని అంశాలపై చర్చ మొదలుపెట్టారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ తన మండలంలో అభివృద్ధి పనులకోసం నిర్ణయించిన రూ.5లక్షల నిధులు మంజూరు చేయడంలేదని, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు.
 
 దీంతో కొద్దిసేపు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొనడంతో గొడవ సద్దుమణిగింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎజెండాలో లేని అంశాలు మాత్రమే మాట్లాడుతుండటంతో అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శా రు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికే సరిపోతోందని, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
 
 ఇది జెడ్పీచైర్మన్‌కు తగదు
 తనపేరు చెబితే పింఛన్ కట్ చేస్తానని లబ్ధిదారులను హెచ్చరించడం జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌కు తగదని, ప్రజాప్రతినిధుల పట్ల ఆయన నిర్లక్ష్యంగా నడుచుకోవడం సమంజసం కాదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. తాను కూడా గద్వాల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రనిధిని అన్న విషయాన్ని జెడ్పీ చైర్మన్ గుర్తించాలని పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు టీఆర్‌ఎస్ పార్టీ ఇవ్వడం లేదని, ప్రజల సొమ్మునే ప్రభుత్వ ఖజానాలోనుంచి పేదలకు అందజేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తనపేరు చెప్పిన వారి పింఛన్ కట్ చేస్తామనడం, ప్రజల్లో తన గౌరవానికి భంగం కలిగేవిధంగా ఆయన మాట్లాడటం సరికాదని డీకే అరుణ హెచ్చరించడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగారు.
  అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని ఆయా పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడికి నిధులు మంజూరు చేయకుండా వివక్షం చూపడం తగదని పేర్కొనడంతోపాటు టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశమందిరంలోని మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లాలని జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొనడంతో పత్రికలు, టీవీ చానళ్లకు సంబంధించిన విలేకరులు పలువురు తమను రమ్మని కబురు పంపి.. ఇప్పుడు వెళ్లమనడం అవమానకరమన్నారు.
 
 వీరజవాన్ మృతికి సంతాపం
 కోయిలకొండ మండలం సంగినోనిపల్లి గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ రెడ్డిగారి గోవర్ధన్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శినితో పాటు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందడం బాధాకరమని, వారి కుటుంబానికి తమ తరఫున సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరం గా ఆదుకుంటామని, పోలీసు శాఖ తరఫున లాంఛనంగా అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు