అన్ని దారులూ జిల్లావైపే..!

18 Jul, 2015 01:50 IST|Sakshi

జిల్లాలోని గోదారి తీరం పులకించింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు కరీంనగర్‌వైపే వస్తున్నారు. దీంతో ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని పుష్కర ఘాట్లు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. నాలుగు రోజుల రికార్డులను మించిన సంఖ్యలో శుక్రవారం ఆయా ఘాట్లలో భక్తులు స్నానమాచరించారు. దాదాపు 12 లక్షల మందికిగా పైగా జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శించినట్లు అధికారుల అంచనా.        

- సాక్షి, ప్రతినిధి కరీంనగర్        
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలు శుక్రవా రం జనసంద్రమయ్యాయి. ఒక్క ధర్మపురిలోనే 5.10 లక్షలమందికిపైగా స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 4.10 లక్షల మంది పుణ్యస్నానమాచరించారు. కోటిలింగాల, మంథనిలోనూ జనం పోటెత్తారు. కోటిలిం గాలలో లక్షమందికిపైగా పుణ్యస్నానమాచరించగా, మంథనిలోనూ సా యంత్రం 85 వేల మందికిపైగా పుష్కర స్నానం చేశారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో జిల్లాలోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయని జిల్లా పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు.
 
 కాళేశ్వరంలో ట్రాఫికర్...
 పుష్కరాల ప్రారంభంలో రెండు రోజుల పాటు భక్తు ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మూడవ రోజు రద్దీ తగ్గింది. కానీ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తరువాత రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం నుంచి ప్రధాన ఘాట్ వరకు వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఒకే రహదారి వెంట ఘాట్ వద్దకు వెళ్లే ఆటోలు, కాలినడకన భక్తు లు వెళ్లడంతో కొంత తోపులాట పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆటోల రాకపోకలను నియంత్రించి మరో రహదారి గుండా పంపివేయడంతో స్వల్పంగా ట్రాఫిక్ సద్దుమణిగింది.
 
 ధర్మపురి... జనపురి
 పుష్కర భక్తులతో ధర్మపురి జనపురిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 5.10 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్‌లు వేర్వేరుగా పుష్కర ఘాట్లను కలియదిరిగి భక్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. భక్తులు ఉదయం 10 గంటల సమయంలో ఎక్కువ సంఖ్యలో రావడంతో రాయపట్నం నుంచి వచ్చే తోవలో ఉన్న వాహనాల పార్కింగ్ సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. అదనంగా పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు అదికారులు చర్యలు చేపట్టారు. భక్తులు సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ధర్మపురి గోదావరి పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తులు గోదావరి ప్రవాహం కోసం దూరంగా వెళ్లి పుష్కర స్నానాలు చేశారు.
 
 ఎండను సైతం లెక్కచేయకుండా...
 గోదావరిఖని పుష్కరఘాట్ వద్ద శుక్రవారం 20 వేల మంది, గోలివాడ పుష్కరఘాట్ వద్ద 4వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శుక్రవారం 36 డిగ్రీ ల ఉష్ణోగ్రత రామగుండం ప్రాంతంలో నమోదు కాగా, ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. పుష్కరఘాట్ వద్ద పిండ ప్రదానాలు చేసేం దుకు బ్రాహ్మణులకు, భక్తులకు టెంట్లు వేయకపోవడంతో వారు ఎండతీవ్రతతో ఇబ్బందులు పడ్డారు.
 
 కోటిలింగాలలో లక్ష స్నానాలు
 ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పుష్కలంగా ఉన్న కోటిలింగాలలో శుక్రవారం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఏకంగా లక్షమందికిపైగా పుష్కర స్నానమాచరించారు. దీంతో కోటిలింగాల ప్రాంతమంతా భక్తు ల తాకిడితో కిక్కిరిపోయింది. జిల్లాలోని మిగిలిన పుష్కర ఘాట్లలోనూ గత మూడురోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగింది. ఆయా ఘాట్లన్నింటిలో కలిపి సుమారు లక్షల మంది పుణ్య స్నానాలు చేసి పులకించిపోయారు.
 
 పుష్కరాల్లో పలువురు వీఐపీలు
 కాళేశ్వరంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఐజీ ఎన్‌కే.సింగ్, మెదక్ జిల్లా తొగుట మహానంద సరస్వతి స్వామిజీ, హంపీ ఉపపీఠాధిపతి గోవిందానందస్వామి, జెన్‌కో డెరైక్టర్ రాధాకృష్ణ, హైకోర్టు రిజిస్ట్రార్ విద్యాధర్‌భట్, సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్య పుష్కరస్నానం చేశారు. మంథనిలో హైకోర్టు మాజీ జడ్జీ పీఎల్‌ఎన్.శర్మతో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మపురిలో తొలి తెలంగాణ మహిళా పైలట్ స్వాతీరావు, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాల్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, దర్శకుడు హరిశంకర్‌లు పుష్కర స్నానాలకు హాజరయ్యారు. గోదావరిఖని సమీపంలోని సుందిల్ల పుష్కరఘాట్ వద్ద సింగరేణి సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్, డెరైక్టర్ ఎ.మనోహర్‌రావు, జనగామ గ్రామ శివారు గోదావరి నది వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగమారుతిశర్మ పుష్కర స్నానాలు చేశారు.   

మరిన్ని వార్తలు