లాభాలు... స్వల్పంగా | Sakshi
Sakshi News home page

లాభాలు... స్వల్పంగా

Published Sat, Jul 18 2015 1:44 AM

లాభాలు... స్వల్పంగా

 సెన్సెక్స్..  28,463   నిఫ్టీ.. 8,610
 
 ముంబై : ఆద్యంతం  ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేని కారణంగా ట్రేడింగ్ మందకొడిగా సాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 28,463 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,610 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా 3వరోజూ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. టెక్నాలజీ, ఫార్మా, లోహ, కొన్ని వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. సాధారణం కంటే 6 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించడం కొంత ప్రతికూల  ప్రభావం చూపింది.

 వారంలో చూస్తే...
 ఈ వారంలో సెన్సెక్స్ 802(2.89 శాతం) పాయింట్లు, నిఫ్టీ 249 (2.98 శాతం)పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. నెల రోజుల్లో ఇంత ఎక్కువగా లాభపడిన వారం ఇదే. నిలకడగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఫార్మా, వాహన షేర్ల పెరుగుదల... దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండడం వంటి కారణాల వల్ల సెన్సెక్స్ 28,576 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 28,417 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 8,643-8,593 పాయింట్ల గరిష్ట. కనిష్ట స్థాయిల మధ్య కదలాడి, చివరకు స్వల్పంగా 2 పాయింట్ల లాభంతో ముగిసింది.

 ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు నష్టాలు..
 అన్ని ఎఫ్‌డీఐలకు ఒకే పరిమితి అన్న విధానం  నుంచి ప్రైవేట్ బ్యాంక్‌లను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో, 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,423 షేర్లు లాభాల్లో, 1,407 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,777 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.14,983 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,86,123 కోట్లుగా నమోదైంది.
 
 హెచ్‌డీఎఫ్‌సీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్‌సీడీ), వారంట్లతో సహా వివిధ మార్గాల్లో రూ.90,000 కోట్లు సమీకరించనున్నది. వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.
 
 బ్యాంక్ షేర్లలో తగ్గిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
 బ్యాంక్ షేర్లలో మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది మేలో రూ. 79,215 కోట్లుగా ఉన్న ఎంఎఫ్ పెట్టుబడులు గత నెలలో రూ.78,582 కోట్లకు తగ్గాయని సెబీ వెల్లడించింది. లాభాల స్వీకరణ కారణంగా ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్లపై పెట్టుబడులు తగ్గించుకున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement