రైల్వే ప్రాజెక్టుల్లో జాప్యంవద్దు: కేసీఆర్

5 Jul, 2014 07:44 IST|Sakshi
రైల్వే ప్రాజెక్టుల్లో జాప్యంవద్దు: కేసీఆర్

* ద.మధ్య రైల్వే జీఎంకు కేసీఆర్ సూచన
* కొత్త లైన్లు, వసతుల కల్పనపై దృష్టి పెట్టండి
* కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి
* కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న కేసీఆర్

 
సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ మరో మూడు రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. రాష్ర్ట అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల చిట్టాను రూపొందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆది నుంచీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అందుకే ఆయన రైల్వే శాఖపై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నారు.
 
బడ్జెట్‌లో తెలంగాణకు ఈసారి మెరుగైన ప్రాధాన్యం దక్కేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా టీఆర్‌ఎస్ ఎంపీలను రైల్వే మంత్రి సదానందగౌడ దగ్గరికి పంపి తెలంగాణ ప్రాథమ్యాలపై పలు ప్రతిపాదనలు అందజేశారు.  ఇటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులపైనా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తనను కలవడానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాస్తవతో పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ర్ట ప్రభుత్వపరంగా అందాల్సిన చేయూత విషయంలో తక్షణమే స్పందిస్తామని, రైల్వేపరంగా పనుల్లో జాప్యం లేకుండా చూడాలంటూ  కేసీఆర్ గట్టిగా కోరారు.
 
 సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి పద్మారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత బడ్జెట్‌లో, రాష్ర్ట విభజన చట్టంలోనూ పేర్కొన్న ఈ ప్రాజెక్టు అమలులో జరుగుతున్న జాప్యాన్ని రైల్వే జీఎం ముందుంచారు. పనుల ప్రారంభం విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి అవసరమైన భూమి సిద్ధంగా ఉందని, వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు వరంగల్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్.. ఫ్యాక్టరీ నిర్మాణానికి తగినంత భూమి అందుబాటులో ఉందని నిర్ధారించారు.
 
 కాజీపేట్ డివిజన్ కోసం ఒత్తిడి
 కాజీపేట్‌ను రైల్వే డివిజన్‌గా మార్చే అంశంపై ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించామని, రైల్వే అధికారులు కూడా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు.  మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణం, పెద్దపల్లి( కరీంనగర్)-నిజామాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు వేగంగా స్పందించాలన్నారు.  
 
 అదనపు టెర్మినళ్లు కావాలి
 రాజధాని హైదరాబాద్‌లో రైల్వే రవాణా వ్యవస్థను బాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిత్యం వందలాది రైళ్లు, లక్షలాది ప్రయాణికులతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైనా ఒత్తిడి పెరిగిన దృష్ట్యా అదనపు టర్మినళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని... మౌలాలి, నాగులపల్లి టర్మినళ్ల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఎంటీఎస్ గురించి ప్రస్తావించారు. రెండో దశ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండవ దశను మెదక్ జిల్లా తూప్రాన్ వరకు, ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించాలన్నారు.

మరిన్ని వార్తలు