వరవరరావుపై ఆందోళన వద్దు: హైకోర్టు

30 Aug, 2018 05:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్‌ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు–మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్‌ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం పేర్కొంది.

మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్‌ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్‌ ఆర్డర్‌ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

ఈ అరెస్ట్‌పై కౌంటర్‌ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్‌ ఆర్డర్‌ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్‌ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్‌లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్‌ ధర్మాసనానికి చెప్పారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు