ఎల్లుండి నుంచి ఎగిరిపోవచ్చు!

23 May, 2020 03:36 IST|Sakshi

ముందుగా మెట్రో నగరాలకు విమాన సర్వీసులు

25న హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తొలి విమానం

దశలవారీగా అన్ని నగరాలకు.. బుకింగ్స్‌ మొదలు

పెరిగిన విమాన టికెట్‌ ధరలు

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచి పోయిన విమానాలు తిరిగి ఎగర డానికి సన్నద్ధమవుతున్నాయి. దేశీయ విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో హైదరాబాద్‌ అంతర్జా తీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు విమానాలను నడిపేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభిం చాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి 25న మొదటి విమానం బయల్దేరనుంది. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర మెట్రో నగరాలకు విమానాలు వెళ్లనున్నాయి. అనంతరం అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్‌ నుంచి విమానాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప తదితర నగరాలకూ పలు ఎయిర్‌లైన్స్‌ బుకింగ్‌లు ప్రారంభించాయి. దశల వారీగా దేశంలోని 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి.

పెరిగిన చార్జీలు...
లాక్‌డౌన్‌ అనంతరం ప్రారంభమవుతున్న అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో చార్జీలు పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ఈనెల 25న టికెట్‌ ధర రూ.8,407 ఉంది. స్పైస్‌జెట్‌లో ఇది రూ.11,220 వరకు ఉంది. హైదరాబాద్‌–చెన్నై టికెట్‌ ధర రూ.4,551 ఉండగా.. ముంబైకి రూ.4,603 చార్జీ ఉంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, తదితర నగరాలకు కూడా చార్జీలు పెరిగాయి. కరోనా కారణంగా విమానంలోని సీట్ల సం ఖ్యను తగ్గిస్తున్నారు.

80 నుంచి 100 సీట్లున్న చిన్న ఫ్లైట్లలో సుమారు 40 నుంచి 50 సీట్లు మాత్రమే వినియోగంలోకి రానున్నాయి. అలాగే 250 నుంచి 300 సీట్లుండే ఫ్లైట్లలోనూ సీట్ల సంఖ్యను భారీగా కుదించనున్నారు. ప్రతి విమానంలో చివరి 3 సీట్లను వదిలేస్తారు. ప్రయాణ సమయంలో అనుకోని విధంగా ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, కరోనా లక్షణాలు కనిపించినా వారిని వెనుక సీట్లలోకి మారుస్తారు. కరోనా నిబంధనల మేరకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అన్నివిధాలుగా సిద్ధం చేశారు. ఎయిర్‌ పోర్టులోకి ప్రవేశించి విమానం ఎక్కే వరకు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. 

>
మరిన్ని వార్తలు