వ్యక్తి అనుమానాస్పద మృతి

19 Jun, 2014 23:55 IST|Sakshi
వ్యక్తి అనుమానాస్పద మృతి

 పరిగి: ఓ వ్యక్తి మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బెల్టు షాపు నిర్వాహకులు మద్యంలో ఏదో కలిపి ఉంటారని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిట్యాల్‌లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య(39)వ్యవసాయ కూలీ. ఇటీవల మద్యానికి బానిసైన ఆయన కూలీడబ్బులు మొత్తం తాగుడుకే వెచ్చించేవాడు. ఈక్రమంలో బుధవారం గ్రామంలోని ఓ బెల్టు షాపులో మద్యం తాగిన ఆయన సాయంత్రం అదే దుకాణం వెనకాల అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు.
 
బెల్టు దుకాణం నిర్వాహకుల సమాచారంతో యాదయ్య కుటుంబీకులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే యాదయ్య మృతిచెందాడు. గురువారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమారుడు రామకృష్ణ(10), కూతురు కీర్తన(8) ఉన్నారు. కాగా బెల్టుషాపు నిర్వాహకులు మద్యంలో ఏదో కలిపి ఉంటారని, అందుకే తన భర్త మృతిచెందాడని యాదయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ షేక్ శంషొద్దీన్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి గురువారం మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నస్కల్ అశోక్ ఉన్నారు.
 
మరో ఘటనలో యువకుడు..
కీసర: మండల పరిధిలోని నాగారం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రామకృష్ణ(23)తన తండ్రి కేశవులతో కలిసి గత రెండు నెలల వరకు నాగారంలోని అరవింద్‌నగర్ కాలనీలో అద్దెకు ఉండేవాడు. అనంతరం తండ్రీకొడుకులు స్వగ్రామానికి వెళ్లారు. రామకృష్ణ ఇంట్లో చెప్పకుండా రెండు రోజుల క్రితం తిరిగి నాగారం వచ్చాడు.

రామకృష్ణ నివాసముండే ఇంటికి సమీపంలో గురువారం అతడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.

మరిన్ని వార్తలు