అవన్నీ నేరమే: అకున్‌ సబర్వాల్

24 Jul, 2017 18:11 IST|Sakshi
అవన్నీ నేరమే: అకున్‌ సబర్వాల్

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో స్కూల్‌ పిల్లల పేర్లు బయటపెట్టబోమని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. విద్యార్థుల్లో మైనర్లు ఉన్నారని, వారి పేర్లు బయటపెడితే జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు మహిళలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. వారు ఎక్కడ కావాలంటే అక్కడే విచారిస్తామని చెప్పారు. వీరిలో ఒకరు సిట్‌ ఆఫీసుకు వస్తామని చెప్పినట్టు వెల్లడించారు.

చట్ట ప్రకారమే నిందితులను ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారని చెప్పారు. నలుగురు సభ్యుల బృందం సినిమా వాళ్లను ప్రశ్నిస్తోందని, విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నామని తెలిపారు. వీటిని కోర్టుకు సమర్పిస్తామన్నారు. అనుమతి లేకుండా శాంపిల్స్‌ తీసుకోవడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. లిఖిత పూర్వకంగా అంగీకరించిన తర్వాతే శాంపిల్స్‌ తీసుకుంటున్నామని వెల్లడించారు. నమూనాలు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ విషయాన్ని కేసు డైరీలో రాస్తామని, బలవంతం చేయబోమని స్పష్టం చేశారు.

తాము సినిమా వాళ్లను లక్ష్యంగా చేసుకున్నామని ఆరోపించడం తగదని, అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. ఈరోజు హోటల్‌ అసోసియేషన్‌ వారిని పిలిచి స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. డ్రగ్స్‌ అమ్మడం, కొనడం, ఇంట్లో పెట్టుకోవడం అన్నీ నేరమే అని పేర్కొన్నారు. ఎవరైనా డిపార్ట్‌మెంట్‌, తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేయడానికి వెనుకాడబోమని అకున్‌ సబర్వాల్‌ హెచ్చరించారు. బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా