ఇంటి పోరు

12 Nov, 2014 03:13 IST|Sakshi

డీఎస్, బొమ్మ వర్గీయుల పోటాపోటీ
శ్రేణులలో ‘మైనారిటీ’ పదవుల చిచ్చు
టీపీసీసీకి ఫిర్యాదుల పరంపర
సభ్యత్వ నమోదులోను విభేదాలు
అస్తవ్యస్తంగా మారిన జిల్లా కాంగ్రెస్ పరిస్థితి
ఓడినా మారని పరిస్థితి పట్టించుకోని ఆధిష్టానం
 గతంలోనూ ఇదే తీరు


నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కల  హాలు ముదిరి పాకాన పడుతున్నాయి. సాధారణ ఎన్నికలలో ఘోర పరాజ  యం పొందినా ఆ పార్టీ నేతలలో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి తదితర దిగ్గజాలున్న జిల్లా లో  వర్గపోరుతో కాంగ్రె  స్ పార్టీ అస్థిత్వాన్ని  కోల్పోయే ప్రమాదం లేకపోలేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రారంభం కావాలిన సభ్యత్వ నమోదు  కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, మరికొన్ని చోట్ల సభ్యత్వ నమోదులోనూ విభేదాలే బయట పడుతున్నాయి. దిగ్గజాల వైఖరి ‘ఎవరికీ వారే యమునా తీరే’లా మారగా నిజామాబాద్ అర్బన్‌లో మైనారిటీలకు ప్రాధాన్యం లేదన్న చిచ్చు రగులుతోంది. ఈ విషయమై డి.శ్రీనివాస్, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

అన్నీ వివాదాలే

కాంగ్రెస్ పార్టీ నగరంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి డీఎస్, ఆయన వర్గీయులు హాజరు కాగా, అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఆయన వర్గం హాజరు కాలేదు. నగర కమిటీ అధ్యక్షుడు కేశ వేణు అధ్యక్ష తన జరిగిన సమావే శంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ ఫోటోను చేర్చలేదన్న అంశం వివాదంగా మారింది. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావిద్ అక్రమ్ ఈ అంశాన్ని ప్రస్తావించగా, నగర కమిటీ సభ్యత్వ సేకరణ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఫోటో అవసరం లేదని సమర్థించడంపైనా కలకలం రేగింది. బొమ్మ మహేశ్ కుమార్‌కు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు సైతం కార్యక్రమాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లుంటే ఐదారుగురే వచ్చారు. ఒకే    వర్గానికి చెందిన నేతలతో కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా పార్టీ సీనియర్ల నుంచి వినిపిం చాయి. అర్బన్ ఇన్‌చార్జ్‌గా బొమ్మ మహేశ్ వ్యవహరిస్తుండగా, డీఎస్ తనయులు, మాజీ మేయర్ సంజయ్, అరవింద్ కాంగ్రెస్ కేడర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపడం, ప్రెస్‌మీట్‌లు నిర్వహించడం గందరగోళానికి తెరతీస్తోంది. చినికి చినికి గాలివానగా మారుతున్న ఆధిపత్యపోరు, అంతర్గత విభేధాలు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిం చాయి.

మైనారిటీలకు పదవులపై రభస

కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు పదవుల కేటాయింపు వివాదాస్పదం అవుతోంది. ఈ విషయమై డీఎస్, బొమ్మ మహేశ్‌కుమార్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. మైనారిటీలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కడం అరుదుగా మారిన తరుణంలో, ఇటీవల మహ్మద్ ఇలియాస్‌కు రాష్ట్ర కార్యదర్శి గా అవకాశం దక్కింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర కార్యదర్శులుగా జిల్లాకు చెందిన భూమారెడ్డి, రాయల్‌వార్ సత్యం, నరాల రత్నాకర్, ప్రేమ్‌దేవ్ అగర్వాల్, రాజేంద్రప్రసాద్ తదితరులకు అవకాశాలు దక్కాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల సమయంలో అర్బన్ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదన్న వాదని కూడా వినిపించింది. అందుకే వారు ఎన్నికలలో పార్టీకి దూరమయ్యారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఇలియాస్‌కు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇలియాస్‌కు పదవి దక్కడం ఇష్టం లేని ప్రత్యర్థి వర్గం నేతలు 15 సంవత్సరాల కిందట పోలీసు కేసులు ఉన్నాయంటూ బయటకు తీసి టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇలియాస్ వర్గం మరో అడుగు ముందుకేసి, తనపై ఫిర్యాదు చేసిన నాయకులపై ఉన్న భూముల ఆక్రమణ, సెటిల్‌మెంట్ వ్యవహారాలు, కేసుల చిట్టా తయారు చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ విభేధాలు అన్ని నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని కార్యకర్తలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు