మద్దతు ధర పెంచడమే పరిష్కారం కాదు

10 Dec, 2018 01:40 IST|Sakshi
స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

ఆదాయం రెట్టింపునకు మరిన్ని చర్యలు చేపట్టాలన్న గవర్నర్‌

పంట మార్పిడి, పంట కోత అనంతర నష్టాలను నివారించాలి

స్టోరేజీ సౌకర్యాల కల్పన, సాగు ఖర్చుల తగ్గింపు అవసరం

సేంద్రియ సాగును ప్రోత్సహించి వనరులను కాపాడాలి

వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో నరసింహన్‌ ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేవలం మద్దతు ధరలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆదివారం జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. నీటి యాజమాన్యం, పంటల మార్పిడి, పంట కోత అనంతర నష్టాలను నివారించేందుకు కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని సృజనాత్మక పద్ధతులతో ఆలోచించి రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత కల్పించడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగని రీతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

సేంద్రియ సాగు, ఔషధ మొక్కలు పెంచాలి 
సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి సహజ వనరులను కాపాడాల్సిన అవసరముందని గవర్నర్‌ సూచించారు. సమర్థ నీటి యాజమాన్యం కోసం జాతీయ నీటి విధానం తీసుకురావాలని.. అందుబాటులోని నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తొలగించేందుకు కృషి చేయడం వల్ల వలసలు నివారించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధి, రైతుల అభ్యున్నతిలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. రైతులు పండించిన పంటలకు విలువ జోడింపు వల్ల వారికి ఆదాయం పెంచే మార్గాలను కనుగొనాలని సూచించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా వర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు వ్యవసాయ వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావును గవర్నర్‌ అభినందించారు.

27 మందికి బంగారు పతకాలు... 
2016–17 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీకి చెందిన 162 మందికి, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 584 మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు అందజేశారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మందికి బంగారు పతకాలు అందించారు. బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐరెడ్ల మౌన్యారెడ్డి ఐదు బంగారు పతకాలతో సత్తా చాటింది. బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఎం.మునిమారుతి రాజు బంగారు పతకాలు అందుకున్నాడు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌తో పాటు డీన్లు, డైరెక్టర్లు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గౌరవప్రద వృత్తిగావ్యవసాయం

గతంతో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ రంగం గౌరవప్రదమైన వృత్తిగా సమాజంలో గుర్తింపు పొందిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్‌ రాజేంద్రసింగ్‌ పరోడాఅన్నారు. ఆయనకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం లేని సమాజ స్థాపనకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. వ్యవసాయ విద్య పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలన్నారు. అనంతరం వీసీ వి.ప్రవీణ్‌రావు 2016–17 విద్యా సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలను వివరించారు. 

మరిన్ని వార్తలు