పర్యాటక రంగంతో ఆర్థికాభివృద్ధి

7 Oct, 2017 03:23 IST|Sakshi
శుక్రవారం హెచ్‌ఐసీసీలో జరిగిన సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ టూరిజం స్టాల్‌

అందుకే ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాం 

2020 నాటికి పది లక్షల మంది విదేశీ పర్యాటకులు 

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ 

78వ ఎస్‌కేఏఎల్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ ప్రారంభం 

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం ఎంతో దోహదపడుతోందని, అందుకే ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్, సాలార్‌జంగ్‌ మ్యూజియంతో పాటు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఏటా 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వస్తున్నారని, 2020 నాటికి విదేశీ పర్యాటకుల సంఖ్య పది లక్షలకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 78వ ఎస్‌కేఏఎల్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి పర్యాటక రంగ సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ బిర్యానీ అందరికీ ఇష్టమని, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే బతుకమ్మ, బోనాలు గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ సదస్సు వీలు కల్పించిందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం పుట్టినిల్లు హైదరాబాద్‌ అని అన్నారు. 30 శాతం ఫార్మా డ్రగ్స్‌ హైదరాబాద్‌లోనే తయారవుతాయని చెప్పారు. విజిట్‌ ఫర్‌ ఆల్‌ రీజన్‌ ఆల్‌ సీజన్‌ అనే నినాదంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రొఫెసర్‌ హిమాన్షు రాయ్‌ మాట్లాడుతూ.. వ్యాపారమంటే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుందని, నష్టాన్ని ఊహించుకుని ఊరుకోలేమని, సక్సెస్‌ అనేది మన నెట్‌వర్కింగ్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. 

పరస్పర సహాయ సహకారాలు 
ఎస్‌కేఏఎల్‌ వరల్డ్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ ఫిషర్‌ మాట్లాడుతూ.. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగుతుందన్నారు. ట్విన్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ట్రావెల్, టూరిజంలో ఎస్‌కేఏఎల్‌ క్లబ్‌లు సహాయ సహకారాలు అందించుకుంటాయని, ఇండో–యూఎస్‌ టూరిజం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని చెప్పారు. విశ్వనగరాలతో పోటీపడి హైదరాబాద్‌ ఈ సదస్సుకు ఎంపికయ్యిందన్నారు. భారత్‌కు ఎనిమిదిసార్లు వచ్చానని, హైదరాబాద్‌కు మూడుసార్లు వచ్చానని, హైదరాబాద్‌లో ముత్యాలు కొనుగోలు చేశానని చెప్పారు. హైదరాబాద్‌ను తనæ పుట్టినిల్లుగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఏఎల్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుసన్న సరి, డైరెక్టర్లు లావొన్నె విట్‌మన్, జాసన్‌ శామ్యూల్, ఎస్‌కేఏఎల్‌ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ విలియం ర్యాన్, ఎస్‌కేఏఎల్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మారియో, ఎస్‌కేఏఎల్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ మోహన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇది అతి పెద్ద కార్యక్రమం..
ఇండియాకు చెందిన 9 ఎస్‌కేఏఎల్‌ క్లబ్‌లు.. అమెరికాకు చెందిన 13 ఎస్‌కేఏఎల్‌ క్లబ్‌లతో జత కట్టాయని, ఎస్‌కేఏఎల్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద కార్యక్రమం అని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ క్యాథరిన్‌ బీ హడ్డా అభివర్ణించారు. ఈ ఏడాదిని ఇండో–యూఎస్‌ ట్రావెలింగ్‌ టూరిజం ఇయర్‌గా ఎస్‌కేఏఎల్‌ ప్రకటించిందన్నా రు. భారత్‌–అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గతం లో ఏడాదికి 20 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగితే.. గతేడాది ఏకంగా 115 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగిందన్నారు. 2009 నుంచి పోల్చి చూస్తే అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రెండింతలైందని, 2015లో 10 లక్షల మంది భారతీయులు నాన్‌ ఇమిగ్రేటెడ్‌ వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు