విద్యా సంస్థలకు ‘న్యాక్’ షాక్!

4 May, 2015 00:55 IST|Sakshi
విద్యా సంస్థలకు ‘న్యాక్’ షాక్!

రూసా నిధుల్లో తెలంగాణకు దక్కని ప్రాధాన్యం
రూ.400 కోట్లు అడిగితే.. రూ.112 కోట్లకే ఓకే
అక్రెడిటేషన్ లేనందువల్లే నిధుల్లో భారీ కోత

 
హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ. 400 కోట్లు అవసరమని రూసా ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో ప్రతిపాదనలు అందజేస్తే కేవలం రూ.112 కోట్ల విలువైన కార్యక్రమాలకే ఓకే చెప్పింది. యూనివర్సిటీలు, కాలేజీలు నిర్వహించే కోర్సులకు నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతోంది. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాత డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అడిగింది. అయితే, న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో నిధులు ఇప్పుడు ఇవ్వడం కుదరదని, అక్రెడిటేషన్ తెచ్చుకున్నాకే ఇస్తామని స్పష్టం చేసింది.

అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయని,  కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకని ప్రశ్నించింది. వీటిపై ప్రతిపాదనలను మళ్లీ అందజేయాలని చేయాలని పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగిన రూ సా సమావేశానికి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కళాశాల విద్యా కమిషనర్ తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి సం బంధించిన వివిధ ప్రతిపాదనలను రూసా అధికారులకు అందజేశారు. అందులో కొన్నిం టికి ఒప్పుకోగా, మరికొన్నింటికి వివరణలు అడిగారు. ఇంకొన్నింటికి న్యాక్ గుర్తింపు లేనందునా నిధులు ఇచ్చేందుకు నిరాకరించారు.
 
వీసీలు లేకపోవడమూ కారణమే..


 రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్, శాతవాహన, పాలమూ రు యూని వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో యూనివర్సిటీకి రూ. 20 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరితే.. కేవలం ఉస్మానియా వర్సిటీకి మాత్రమే రూ. 20 కోట్లు ఇచ్చేం దుకు ఒప్పుకుంది. మిగిలిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేనందున నిధులు ఇవ్వబోమని పేర్కొంది. అయితే, 4 వర్సిటీలకు రెండు మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్లు లేకపోవడం.. ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్లు వాటికి న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆ యూనివర్సిటీలకు నిధులు రాకుండాపోయాయి.
 
 
 ఇతర ప్రతిపాదనలదీ అదే దారి..


 ఆదిలాబాద్ లో రూ. 12 కోట్లతో మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఓకే చెప్పకుండా... మరింత సమాచారం కావాలని కోరింది.ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కోదానికి రూ.26 కోట్లతో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కోసం రాష్ర్టం ప్రతిపాదించగా... ఇప్పటికే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయంటూ మంజూరుకు అంగీకారం తెలపలేదు.  హైదరాబాద్‌లో రెండు, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లో ఒకటి చొప్పున పాత డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకుంటే మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు.

44 డిగ్రీ కాలేజీలకు అభివృద్ధి చేసేందుకు ఒక్కో దానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు అడిగితే.. న్యాక్ గుర్తింపు ఉన్న 30 కాలేజీలకు మాత్రమే అనుమతి. మిగితా వాటికి న్యాక్ గుర్తింపు వచ్చాకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలకు మోక్షం లభించలేదు. రూసా అమలులో భాగంగా ముందస్తు ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ. 2.6 కోట్లు మంజూరు చేసింది. మరో రూ. 1.4 కోట్లు రాష్ట్ర వాటాగా వెచ్చించి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు