ప్రొఫెసర్లు, విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్లు, విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి

Published Mon, May 4 2015 12:55 AM

ప్రొఫెసర్లు, విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి - Sakshi

రాహుల్ పర్యటనకు ఇంకా ఖరారు కానీ తేదీ, ప్రాంతం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16లోగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ఏదో ఒక కరువు ప్రాంతంలో పాదయాత్ర చేస్తారని సమాచారం. రాహుల్ పర్యటన కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నాలుగు జిల్లాల వివరాలతో ప్రతిపాదనలు పంపింది. నిర్మల్ (ఆదిలాబాద్), నర్సాపూర్ (మెదక్), పరిగి (రంగారెడ్డి), స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్) ప్రాంతాల్లో ఎక్కడైనా పర్యటించవచ్చునని రాహుల్‌గాంధీకి సూచించింది.

అయితే, ఎక్కడ పర్యటిస్తారన్న విషయంపై రాహుల్‌గాంధీ ఇంకా స్పష్టత ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్లు, విద్యార్థులు మేధావులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఆయన వెళ్లనున్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలపై కూడా ప్రొఫెసర్లతో రాహుల్‌గాంధీ చర్చించనున్నారని తెలుస్తోంది. వీటితో పాటు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొననున్నారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement