నయా జోష్‌లో ప్రధాన పార్టీలు

3 Apr, 2019 13:52 IST|Sakshi

వ్యూహ, ప్రతి వ్యూహాల్లో అభ్యర్థులు 

మేనిఫెస్టో అంశాలపై విస్తృత ప్రచారం 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : జిల్లాలో వరుసగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జరిపిన పర్యటనలు ఆయా పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న అగ్రనేతలు తమ పార్టీ అభ్యర్థులతో పాటు క్యాడర్‌కు కూడా  దిశానిర్దేశం చేసి వెళ్లారు. సభలన్నీ విజయవంతం కావడంతో ప్రధాన పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు.  

సమీపిస్తున్న పోలింగ్‌ 
పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే గడువు ఉండడం, ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు, ముఖ్యనేతలు. ఇప్పటికే  అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఊరూవాడ పర్యటిస్తూ అన్ని వర్గాలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారి పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలు, అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, క్యాడర్‌ను గుర్తిస్తూ వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. పగలంతా ఎన్నికల ప్రచారం.. సాయంత్రం క్యాడర్‌తో వ్యూహరచనలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. 

ఒక్కొక్కటిగా వదులుతున్న ప్రచారాస్త్రాలు 
ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ ప్రచారాస్త్రాలకు పదును పెట్టి ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రాజకీయ అనుభవం.. స్థానికత అంశాలే ప్రధాన ఎజెండాగా ఒకరిపై మరొకరు విమర్శలు.. ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు.. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై మాట్లాడుతున్నారు.

తెలంగాణలో 16 స్థానాల్లో గెలుపొంది థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతో జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్‌ పార్టీ గత ఐదేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం మైనార్టీల ఓట్లను కూడగట్టడానికి తాజాగా 12 శాతం రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో స్థానిక ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీని పిలిపించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కడితేనే 12శాతం రిజర్వేషన్‌ వచ్చితీరుతుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

ఇటు మహబూబ్‌నగర్‌ అటు నాగర్‌కర్నూల్‌ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతితో పాటు ఆ పార్టీ శ్రేణులు దేశ రక్షణ.. భద్రతతో పాటు కేంద్రంలో మోదీ అవసరంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లురవి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే న్యాయ్‌ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72వేలు జమ చేస్తామనీ, రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామనే అంశాలపై ప్రచారం చేస్తున్నారు. 

చివర్లో ఇంకొందరు..? 
ఇప్పటికే బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అధినేతలు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ పరిధుల్లో పర్యటించారు. ఈనెల 7న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, షాద్‌నగర్‌లో స్థానిక ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం వచ్చే అవకాశాలున్నాయని ఆయా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.   

మరిన్ని వార్తలు