నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు

8 Aug, 2019 03:14 IST|Sakshi

ములుగు జెడ్పీ తొలి సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

సాక్షి, హైదరాబాద్‌: బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కొత్త జెడ్పీపీ చైర్‌పర్సన్లు , వైస్‌ చైర్‌పర్సన్లు కో ఆప్షన్‌ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని జడ్చర్ల ఎంపీపీలు, ఎంపీటీసీలు బుధవారం తొలిసారిగా సమావేశమై బాధ్యతలు చేపట్టారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు పదవులు చేపట్టారు.

వీరంతా బుధవారం నుంచి ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. మహబూబాబాద్‌ జిల్లా జెడ్పీపీని అక్కడి ఎంపీడీవో కార్యాలయంలో, ములుగు జిల్లా జెడ్పీపీని ములుగు ఎంపీడీవో ఆఫీసులో, ఖమ్మం జిల్లా జెడ్పీపీని పాత జిల్లా పరిషత్‌లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీపీని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా జెడ్పీ తొలి సమావేశంలో పీఆర్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
గత నెలలోనే 28 జెడ్పీపీల్లో పాలకమండళ్లు... 
గత నెల 7న 28 జిల్లా పరిషత్‌ల చైర్‌పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. అప్పుడు పదవుల్లోకి వచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్లు అదే రోజున తొలి సమావేశం నిర్వహించి పదవులు చేపట్టారు. పదవీకాలం ముగియకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నాలుగు జెడ్పీపీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడలేదు. ఇప్పుడు అన్ని జిల్లా పరిషత్‌లలో పాలక వర్గాలు కొలువుదీరినట్టు అయింది.  

మరిన్ని వార్తలు