స్పష్టమైన అవగాహనకు రండి

4 Dec, 2014 07:33 IST|Sakshi

* ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు గవర్నర్ ఆదేశం  
* ఉమ్మడి పరీక్షలకే సానుకూలమన్న ఏపీ
* బోర్డు పూర్తిగా తమ పరిధిలోకి వస్తే అభ్యంతరం లేదన్న తెలంగాణ
* విద్యార్థులను అయోమయంలోకి నెట్టకుండా పరిష్కరించుకోవాలని నరసింహన్ సూచన

 
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే విషయంలో స్పష్టమైన అవగాహనకు రావాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. గవర్నర్ బుధవారం ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు.
 
 ఈ సందర్భంగా ఉమ్మడిగా పరీక్షల నిర్వహణకు తాము సానుకూలమని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొనగా... పదో షెడ్యూ ల్ ప్రకారం ఇంటర్ బోర్డు తెలంగాణ చేతుల్లో ఉండాలని, అలా జరిగితే ఉమ్మడి పరీక్షలకు అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర సీఎస్ రాజీవ్‌శర్మ స్పష్టం చేశారు. బోర్డు చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి ఉండాలని, బోర్డులో తెలంగాణ అధికారులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే ఇరు రాష్ట్రాలకు తామే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అలా కాని పక్షంలో బోర్డును విభజించాలని రాజీవ్‌శర్మ కోరారు.
 
  గవర్నర్‌తో సమావేశ సారాంశాన్ని ఆయా ప్రభుత్వాల సీఎస్‌లు తమ రాష్ట్రాల సీఎంలకు వివరించారు కూడా. కాగా.. ఈ వివాదాన్ని మరింత పెంచడం ద్వారా విద్యార్థులను అయోమయంలోకి నెట్టవద్దని గవర్నర్ ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు స్పష్టం చేశారు. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహిస్తే బాగుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై  తెలంగాణ సీఎస్ స్పందిస్తూ.. తమ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు ఏపీ అంగీకరిస్తే ఇరు రాష్ట్రాలకు పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై పట్టుదలకు పోకుండా ఉమ్మడి పరీక్షల నిర్వహ ణకు అంగీకరించాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కోరినట్లు తెలిసింది. కాగా.. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్‌లతో పాటు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శులు అధర్‌సిన్హా, వికాస్‌రాజ్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి రాంశంకర్‌నాయక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు