అందరికీ ‘ఆసరా’

16 Dec, 2014 02:49 IST|Sakshi

‘ఆసరా’ పథకం కింద దరఖాస్తు చేసుకునే అర్హులందరికీ వారం రోజులలో పింఛన్ అందజేస్తామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. సమగ్రసర్వే, డోర్‌లాక్, సాంకేతిక కారణాలతో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారందరి పింఛన్లను పునరుద్ధరిస్తామన్నారు.లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం సాగుతుందని, ఎట్టి పరిస్థితులలోనూ అర్హులను విస్మరించేది లేదని అన్నారు. సోమవారం ఆయన తన ఛాంబర్‌లో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఆసరా పథకం కింద అందిన  దరఖాస్తులను వివిధ రకాలుగా సర్వే చేసిన తర్వాత 2,03,886 మంది అర్హులుగా తేలింది. అర్హులందరికీ ఈ నెల పది నుంచి నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించిన రెండు నెలల ఫించన్లను పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో 11,770 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వివిధ కారణాలతో చాలామంది పింఛన్‌దారుల జాబితాలో పేర్లు కోల్పోయారు’’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. అయితే, ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందేవరకు ప్రభుత్వం దీనిని కొనసాగిస్తుందని చెప్పారు.

అర్హులను ఎంపిక చేసే ందుకు ఆధార్ ఒక్కటే ఆధారం కాదని, వయస్సు ను ధ్రువీకరించే ఏ పత్రాలనైనా సంబంధిత అధికారులకు చూపించవచ్చని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలా ంగులు, ఇతర ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు జిల్లా కేంద్రానికి రానవసరం లేదని, మండల కేంద్రాలలో ఉన్న అధికారులకు అందజేయాలని సూచించారు. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న వారం రోజులలో కొత్తగా ఫించన్లు మంజూరు చేస్తామన్నారు. ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులలో నిరాకరణకు గురైన వాటి వివరాల ను కూడ త్వరలోనే గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుపై అంటిస్తామన్నారు.

మరిన్ని వార్తలు