30న మంత్రివర్గ విస్తరణ!

19 Jul, 2014 01:22 IST|Sakshi
30న మంత్రివర్గ విస్తరణ!

ఆరుగురిని తీసుకునే వీలున్నా..  ఐదుగురితోనే సరిపెట్టనున్న సీఎం కేసీఆర్
 
ఈ సారి జూపల్లికి కచ్చితంగా స్థానం!
విస్తరణలో ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం
మహిళల్లో చోటు ఒకరికా.. ఇద్దరికా?

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ నెల 30వ తేదీన విస్తరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల చివరివారంతో ఆషాఢ మాసం పూర్తవుతుందని.. ఆ తరువాత ఒకటిరెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణను చేపట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి వీలుంది.  ఐదుగురితోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కొంతకాలం తర్వాత మరొకరికి మంత్రిగా అవకాశమివ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ఉన్నదేమిటో ఎవరికీ తెలియ డంలేదు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌కు జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఆయనకు సామాజిక వర్గం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఆ సామాజికవర్గం నుంచి సీఎం కేసీఆర్ సహా హరీశ్‌రావు, కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాత్రం అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో కచ్చితంగా అవకాశం దక్కనుంది. తొలి మంత్రివర్గ ఏర్పాటులోనే జూపల్లికి అవకాశం వస్తుం దని అంచనా వేసినా... ఆ సామాజికవర్గం నుంచి ఎక్కువమంది అవుతున్నారనే ఏకైక కారణంతో అప్పుడు వాయిదా వేశారు. దాంతో.. ‘ఉద్యమంలో ఉన్నప్పుడు అవరోధం కాని కులం మంత్రివర్గంలో స్థానం అనే సరికి అవరోధం అవుతుందా? మంత్రి పదవిని, కాంగ్రెస్‌ని వదిలిపెట్టి  ఉద్యమంలోకి వచ్చిన నాకు తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్న గౌరవం ఇదేనా?’ అని జూపల్లి ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా.  మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సి.లక్ష్మారెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది.

పెరుగుతున్న ఆశావహుల జాబితా..

మంత్రివర్గం విస్తరణలో జాప్యం పెరుగుతున్న కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండు, మూడేళ్లు నిరీక్షించి ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు కోరుదామనుకున్నవారు కూడా ఈ విస్తరణలోనే అవకాశం కోరుతున్నారు. బీఎస్పీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి కూడా కేబినెట్‌లో చోటు కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుగానే ఇంద్రకరణ్‌కు ఈ మేరకు హామీ లభించినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే జిల్లా నుంచి సీనియర్‌గా ఉన్న నల్లాల ఓదెలుకు చీఫ్ విప్‌గా అవకాశం రానుంది. ఎస్టీ వర్గం నుంచి కోవ లక్ష్మికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.  వరంగల్ జిల్లా నుంచి కూడా ఎ.చందూలాల్‌తో పాటు కొండా సురేఖ, డి.వినయ్‌భాస్కర్ మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్టీ  కోటాలో స్థానం కోసం ఎ.చందూలాల్, రాములు నాయక్, కోవ లక్ష్మి ఎదురుచూస్తున్నారు. సీనియర్‌గా ఉన్న చందూలాల్‌కు అవకాశం దక్కుతుందని నేతలు చెబుతున్నా.. రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా తీసుకోవడానికి ముందుగానే మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీని కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కోవ లక్ష్మికి అవకాశమిస్తే ఎస్టీ కోటాతోపాటు మహిళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇద్దరు మహిళలకైనా చోటివ్వకపోతే వారికి తగిన ప్రాతినిధ్యం లేదనే విమర్శలు వస్తాయనే చర్చ టీఆర్‌ఎస్‌లో ఉంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ధీమాలో ఉన్నారు.
 
 

మరిన్ని వార్తలు