మామిడికి బీమా.. రైతుకు ధీమా

27 Nov, 2014 03:10 IST|Sakshi

బెల్లంపల్లి/చెన్నూర్ : ప్రకృతి వైపరీత్యాలతో ఏటేటా నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రబీలో మామిడి తోటలకు వాతావరణ ఆధారిత బీమా వర్తింపజేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బీమా సదుపాయం కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలకు బీమా సౌకర్యం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వాతావరణ ఆధారిత బీమా పథకం అమలు తీరు, వర్తింపు తదితర వివరాలను జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పీవీ రమణ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 24,928 హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 15,617.7 హెక్టార్లలో మామిడి చెట్లు ఫలసాయాన్ని అందిస్తున్నాయి. 50ఏళ్ల వయస్సు కలిగిన మామిడి చెట్లు 22,311 హెక్టార్లలో, ఐదేళ్ల వయస్సు కలిగిన చెట్లు 2,617 హెక్టార్లలో ఉన్నాయి. మార్కెట్‌లో అధిక డిమాండ్ కలిగిన దశేరి, బంగెనపల్లి, మల్లిక, తోతపురి తదితర రకాల చెట్లను పెంచుతున్నారు.

 చెట్టు వయస్సు ఆధారంగా..
 రైతులు మామిడిచెట్లకు బీమా చేయిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పూర్తి స్తాయి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మామిడి చెట్టు వయస్సు ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న చెట్టుకు రూ.450 బీమా కోసం రూ.52 ప్రీమియం చెల్లించాలి. ఇందులో రైతు రూ.26 ప్రీమియం చెల్లిస్తే మిగతా రూ.26 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన స్థాయిలో ప్రీమియం భరిస్తాయి. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన చెట్టుకు రూ.800 బీమా కోసం రూ.92 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతు రూ.46 ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం ప్రభుత్వం సబ్సిడీ రూపేణా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.

 వర్తింపు ఇలా..
 మామిడి తోటలకు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా బీమా కల్పిస్తుంది. మామిడి సీజన్‌లో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల ఆధారంగా ఇన్స్యూరెన్స్‌ను బీమా కంపెనీ చెల్లిస్తుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో అకాల వర్షాలు కురిసి మామిడి పూత రాలిపోయినా, తెగుళ్లు సోకినా బీమా పరిహారం పొందవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో తీవ్రమైన ఎండతో పిందెలు రాలిపోయినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి మే 31వ తేదీ మధ్యలో వాడగాలులు, ఇతర ప్రకృతి ప్రభావంతో చెట్లపై నుంచి కాయలు రాలినా బీమా వర్తిస్తుంది.

 తుది గడువు..
 మామిడి తోటలకు బీమా చేయించుకోవడానికి ప్రభుత్వం తుది గడువు విధించింది. 2014 డిసెంబర్ 15లోపు బీమా చేయించుకోవడానికి అవకాశం కల్పించింది. మామిడి తోటల పెంపకానికి బ్యాంకుల నుంచి రుణం పొందిన, పొందని రైతులు ప్రభుత్వం నిర్దేశించిన తుది గడువు లోపల బీమా ప్రీమియం చెల్లించడానికి వీలుంది. బీమా ప్రీమియాన్ని రైతులు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది. సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అనుబంధంగా ఉన్న బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రైతుల వద్దకు వచ్చి బీమా ప్రీమియం డీడీలను తీసుకుంటారు. ఇతర వివరాలకు బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచి మేనేజర్ సాయిబాబా ఫోన్ నం.9705188786లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు