సాగునీటి కోసం రైతుల ఆందోళన

2 Aug, 2018 00:46 IST|Sakshi

ఎస్సారెస్పీ ఆఫీసు ముట్టడి, సామగ్రి ధ్వంసం

జాతీయ రహదారిపై రాస్తారోకో

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రైతులు కన్నెర్ర జేశారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంత నిజామాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలకు చెందిన రైతులు వారి కుటుంబాలతో ఎస్సారెస్పీ కార్యాలయ ముట్టడికి తరలి వచ్చారు. సుమారు 3 వేల మంది ఉదయం 11 గంటల నుంచి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.

ప్రాజెక్ట్‌ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయంలోకి చొరబడ్డారు.ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, కార్యాలయ బోర్డును తొలగించారు. ఏసీలను, తలుపులను ధ్వంసం చేశారు. వీరికి మహిళా రైతులు కూడా తోడవ్వడంతో ఎస్సారెస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని చెప్పి, నీరు ఎందుకు విడుదల చేయలేదని రైతులు ప్రశ్నించారు.

గంటన్నర తర్వాత పోలీసులు రైతు ప్రతినిధులు, అధికారు లతో సమావేశం ఏర్పాటు చేయించినా ఎటూ తేల్చక పోవడంతో రైతులు ఎస్సారెస్పీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి 44 వరకు కాలినడకన వెళ్లి, మెండోరా మండలం చాకీర్యాల్‌ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేశారు. 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  రాత్రి 8.30 గంటల వరకు రాస్తారోకో జర గడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. 2 బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

మరిన్ని వార్తలు