రోడ్డెక్కిన అన్నదాతలు

11 May, 2014 02:22 IST|Sakshi

వీణవంక/రామడుగు/మానకొండూర్/కోరుట్ల,  న్యూస్‌లైన్ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీణవంక మండలం చల్లూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. తహశీల్దార్ బావ్‌సింగ్ ఫోన్‌లో రైతులతో మాట్లాడి కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

రామడుగు మండలం వెదిరలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. వైఎస్సార్‌సీపీ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి మల్యాల ప్రతాప్ రైతులకు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనను కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ఫోన్‌లో వివరించారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించడంతో రైతులు ఆందోళన విరమించారు.

 అకాల వర్షాలకు నీటిపాలైన వరితో పాటు తడిసిన విత్తన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని మానకొండూర్ మండలం చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామాల రైతులు గట్టుదుద్దెనపల్లిలోని సీడ్ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన సీడ్ అధికారులు రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. అకాల వర్షాలకు తడిచిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరుట్ల మండలం యెఖీన్‌పూర్ రైతులు కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

మరిన్ని వార్తలు