వాయనం: నూనె పోయవద్దు... వేయండి! | Sakshi
Sakshi News home page

వాయనం: నూనె పోయవద్దు... వేయండి!

Published Sun, May 11 2014 2:05 AM

వాయనం: నూనె పోయవద్దు... వేయండి!

ఆరోగ్యం బాగుండాలంటే నూనె తక్కువ వాడాలని చెబుతుంటారు వైద్యులు. అలా అన్నారు కదా అని కంగారుపడి మొత్తానికి మానేస్తుంటారు కొందరు. కానీ నూనెను అస్సలు వాడకపోవడం కూడా మంచిది కాదు. శరీరంలోని కండరాలు, కళ్లు, ఎముకలు, చర్మం వంటి వాటి పనితీరు మెరుగ్గా ఉండాలంటే నూనెను తగినంత తీసుకోవడం అవసరం. కాబట్టి మొత్తానికి మానేయకుండా వాడకంలో మార్పులు చేస్తే సరిపోతుంది. ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి, దేని వల్ల ఎంత ఉపయోగం అన్న విషయాలు తెలుసుకుంటే చాలు.
 
 ఒక వ్యక్తి నెలకు అరకిలోకి మించి నూనె వాడకూడదు. మాంసాహారం తినేవాళ్లు ఇంతకంటే తక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే... మాంసం ద్వారా శరీరంలో చాలా కొవ్వు చేరుతుంది. నూనె కూడా ఎక్కువ తీసుకుంటే కొవ్వు మోతాదు పెరిగి ఆరోగ్యం చెడుతుంది. అందుకే నూనె వాడకాన్ని తగ్గించాలి. ఆ వాడేది కూడా... ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనెను వాడటమే మంచిదంటున్నారు వైద్యులు. ఈ యాసిడ్స్ ఎక్కువగా ఆలివ్ నూనెలో ఉంటాయి. అందుకే అన్ని నూనెల్లోకీ ఆలివ్‌నూనె ఉత్తమం అంటున్నారు నిపుణులు.
 
 విదేశాల్లో ఆలివ్‌నూనె వాడకం చాలా ఎక్కువ. సలాడ్స్‌లోను, కూరల్లోను కూడా దీనినే వాడతారు. ఒమేగా 3, మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఆలివ్ నూనె వాడితే రక్తపోటు, గుండె వ్యాధులు, కాలేయ వ్యాధులు, కీళ్లనొప్పులు రావు. అయితే ధర కాస్త అధికం. అందుకే అందరూ వాడలేరు. అలాంటప్పుడు సోయా నూనె, రిఫైన్డ్ వేరుశెనగ నూనె వాడటం మంచిది.
 
 మరో విషయం ఏమిటంటే... మనం ఎప్పుడూ ఒకే రకమైన నూనెను వాడ కుండా రెండు మూడు నూనెలు కలిపి వాడినా, ఒకటి తర్వాత ఇంకొకటిగా మార్చి మార్చి వాడినా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో నూనె ద్వారా ఒక్కో రకమైన పోషకాలు అందుతాయి. అవన్నీ అందాలంటే ఇలా మార్చి మార్చి వాడటం ఉత్తమం అన్నమాట. అయితే... ఎన్ని చెప్పుకున్నా చివరకు చెప్పేది ఒకటే, నూనె వాడకం తగ్గించాలి అని. అందుకు ఓ మంచి మార్గం ఉంది. సీసాలు, జార్‌ల ద్వారా నూనెను పోస్తే మనకు తెలీకుండానే ఎక్కువ పడిపోతుంది. అదే చెంచాతో కొలిచి వేస్తే తక్కువ పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... నూనెను పోయకూడదు, వేయాలి అన్నమాట!
 
 పది నిమిషాల్లో పాప్‌కార్న్!
 థియేటర్‌లో సినిమా చూస్తున్నా... ఆదివారం పూట టీవీలో సినిమా చూస్తున్నా... చేతిలో పాప్‌కార్న్ బౌల్ ఉంటే ఆ మజానే వేరు. వేడివేడి పాప్‌కార్న్‌ని నోట్లో వేసుకుంటూ, కళ్లను సినిమాకి అప్పగించేయడంలో ఉండే ఎంజాయ్‌మెంట్ మరి దేనిలోనూ ఉండదు. అది సరే కానీ, థియేటర్లో అంటే కొనేసుకుంటాం, ఇంట్లో సినిమా చూసేటప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు కదూ! అప్పుడు కూడా పాప్‌కార్న్ మిస్ కానక్కర్లేదు. ఎందుకంటే మనకి పాప్‌కార్న్ మేకర్ అందుబాటులో ఉంది కాబట్టి! దుకాణాల్లో పాప్‌కార్న్ చేసుకోవడానికి అవసరమైన మొక్కజొన్న గింజలు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి కుక్కర్‌లో చేసేసుకుంటున్నారు చాలామంది. అయితే కొన్నిసార్లు అడుగంటడం, కొన్ని గింజలు వేగకుండా ఉండిపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఈ మేకర్‌తో అలాంటి సమస్యలు ఉండవు. మేకర్ ఆన్ చేసి దాని ముందు గిన్నె పెడితే చాలు... తయారైన పాప్‌కార్న్ గిన్నెలో పడిపోతుంది (ఫొటో చూడండి). దీనివెల కూడా కొనలేనంత ఎక్కువేమీ లేదు. 1250 రూపాయలు ఖర్చుపెడితే చాలు!
 

Advertisement
Advertisement