నిధులిస్తే.. నీళ్లు..!

28 May, 2014 01:03 IST|Sakshi

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :  కొత్త సర్కారుపై కర్షకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ ఎన్నిక ల సమయంలో సాగునీరు తప్పకుండా అందిస్తాం అని చెప్పడం.. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ కూడా తక్కువ వ్యయం కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను పరిశీలనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించినట్లుగా జిల్లాలో కూడా కొన్ని ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో పూర్తయ్యే దశలో ఉన్నాయి.

ర్యాలీవాగు, గొల్లవాగులకు స్వల్పంగా రూ.2 కోట్ల లోపే ఉండగా, నీల్వాయి, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్లలోపు కేటాయిస్తే వేలాది ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు ఆధునీకీకరణలో ఉన్నాయి. ఇందులో భారీ తరహా ప్రాజెక్టు కడెంకు రూ.18 కోట్లు, స్వర్ణ ప్రాజెక్టుకు రూ.7 కోట్లు, సాత్నాల ప్రాజెక్టుకు రూ.5 కోట్లు మాత్రమే అవసరం ఉన్నాయి. ఇ లాంటి ప్రాజెక్టులకు కొత్త సర్కారు నిధులు విడుదల చేసిన పక్షంలో  పూర్తయి అదనంగా లక్షల ఎకరాలకు నీరందనుంది.

 జలయజ్ఞంపై దృష్టిసారిస్తే మేలు..
 జిల్లాకు మూడు వైపుల మహారాష్ట్ర ఉండగా మరోవైపు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా నదుల రూపంలో సరిహద్దులు ఉండడం జిల్లా ప్రత్యేకత. ఒకవైపు పెన్‌గంగా, మరోవైపు వార్ధా, ఇంకోవైపు ప్రాణహిత, ఇంకొదిక్కు గోదావరి నదులతో జిల్లా కళకళలాడుతోంది. మిడిల్ గోదావరి బేసిన్ ద్వారా 62.25 శాతం, పెన్‌గంగా సబ్‌బేసిన్ ద్వారా 66.67 శాతం, వార్ధా సబ్‌బేసిన్ ద్వారా 1.64 శాతం, ప్రాణహిత బేసిన్ ద్వారా 29.26 శాతం నీళ్లు ప్రవహిస్తాయి. జిల్లాలో ప్రతి ఏడాది 1,157 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది.

 అయితే ప్రతి ఏడాది వర్షకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా పోతుంది. ఈ దశలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో అనేక ప్రాజెక్టులను నిర్మించ తలపెట్టారు. అవి చివరి దశలోకి చేరుకునే సమయంలో ఆయన దురదృష్టవశాత్తు మృతిచెందారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు జలయజ్ఞంపై దృష్టిసారించకపోవడంతో ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టిసారిస్తే తెలంగాణలో బంగారు పంటలు పండే అవకాశం ఉంది.

 అసంపూర్తి పనులు.. ఆయకట్టు అందని నీరు..
 కొమురం భీమ్, గొల్లవాగు, మత్తడివాగులు దాదాపు పూర్తయ్యాయి. కొద్దిపాటి నిధులతో కాల్వలు నిర్మిస్తే సుమారు 1.42 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. గడ్డెన్నవాగు, సుద్ధవాగు, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తయిన కాల్వ లు లేక పూర్తిస్థాయిలో నీరందడం లేదు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 45,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కొమురం భీమ్ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరూపయోగంగా మారింది. దాదాపు 60 శా తం పనులు పూర్తయ్యాయి.

కెనాల్ లైనింగ్, పిల్ల కాల్వలు వాటిపై స్ట్రక్చర్స్ కట్టాల్సి ఉంది. భూసేకరణ, అటవీ భూముల పరంగా క్లియరెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయి. జైపూర్, చెన్నూరు మండలాలకు చెందిన 20 గ్రామాలకు సాగునీరందించే బృహత్తర పథకం పాలకుల నిర్లక్ష్యంగా నిరూపయోగంగా మారింది. జైపూర్ మండలం భీమారం శివారులో గొల్లవాగుకు అడ్డంగా గోదావరి బేసిన్‌లో జి-5 ఉప బేసిన్ పరి ధిలో ఈ ప్రాజెక్టు ఉంది. పిల్లకాల్వల మీద స్ట్రక్చర్స్ కట్టాల్సి ఉంది. ఇందులో కూడా భూసేకరణకు ఇబ్బందులు ఉన్నాయి. తాంసి మండలంలోని వడ్డడిలో జైనథ్, ఆదిలాబాద్, తాంసి మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన దాదాపు 8,500 ఎకరాలకు  సాగునీరందించే లక్ష్యంతో నిర్మించబడింది మత్తడివాగు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది.

 రైల్వే క్రాసింగ్ వర్క్ ఉండడంతో డిస్ట్రిబ్యూటరీ నెంబర్ 14లో పనులు అసంపూర్తిగా నిలి చాయి. తాజాగా కుడి కాల్వ కెనాల్ కోసం ప్రతిపాదనలు పం పారు. రూ.9 కోట్లతో కుడికాల్వ నిర్మాణం కోసం అంచనాలు వేశారు. 4 కిలోమీటర్ల పొడవులో 1,600 ఎకరాలకు నీరందిం చేందుకు కుడికాల్వ ఉపయోగపడుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సరస్వతీ కెనాల్, గడ్డెన్నవాగు తదితర ప్రాజెక్టులు జిల్లా వ్యాప్తంగా చిన్నచిన్న లోపాలను సవరిస్తే ఆయకట్టు చివరి భూములకు నీరందించే అవకాశం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ఆధునీకీకరణ పనుల్లో ఉన్న సాత్నాల, స్వర్ణ, కడెం ప్రాజెక్టులకు స్వల్ప నిధులు కేటాయిస్తే పనులు పూర్తవుతాయి.

మరిన్ని వార్తలు