ఉద్యోగులమా.. కూలీలమా!

22 Nov, 2019 02:52 IST|Sakshi
కమిషనరు తోటలో పనిచేసేందుకు వచ్చిన ఉద్యోగులు  

ఉద్యానశాఖ రాష్ట్ర కమిషనర్‌ తోటలో రెండు శాఖల ఉద్యోగుల మధ్య గొడవ

వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ ఆవేదన

అలాంటిదేం లేదని ఉన్నతాధికారుల వివరణ

నిర్మల్‌/దిలావర్‌పూర్‌: నిర్మల్‌ జిల్లాలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ఉద్యోగులు, సిబ్బంది మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశమైంది. తాము ఉద్యోగులమా? కూలీలమా? అనుకునే స్థాయికి పరిస్థితి చేరడంతో అందరి దృష్టి సదరు శాఖలపై పడింది. జిల్లాలోని దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ రాష్ట్ర కమిషనర్‌ లోక వెంకట్రాంరెడ్డికి చెందిన వ్యవసాయక్షేత్రం ఉంది. ఇందులో గురువారం హార్టికల్చర్, సెరికల్చర్‌ ఉద్యోగులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అసలు ఆ రెండు శాఖల ఉద్యోగులకు కమిషనర్‌ వ్యవసాయక్షేత్రంలో ఏం పని?..కమిషనర్‌ మెప్పు కోసమే సదరు ఉద్యోగులతో చాకిరీ చేయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. సదరు శాఖల జిల్లా అధికారులు మాత్రం విధి నిర్వహణలో భాగంగానే ఈ పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు.

అక్కడే విధులా..? 
కమిషనర్‌కు చెందిన 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ పండ్ల చెట్లు, ఇతర పంటలు సాగు చేయిస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా హార్టికల్చర్‌ శాఖ ఉద్యోగులు, సిబ్బందితోనే పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమితులైన ఇద్దరు హెచ్‌ఈవోలు ఇక్కడి పనులు చూసుకుంటున్నారు. తమ శాఖల కార్యాలయాల సిబ్బందితోనే తోట పని చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మల్బరీ సాగుతో వివాదం..
వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ మొక్కలు నాటేందుకు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలో పనిచేసే నలుగురు రెగ్యులర్‌ ఉద్యోగు లు, నలుగురు కాంట్రాక్ట్‌ సిబ్బందిని క్షేత్రానికి రప్పించారు. గురువారం సెరికల్చర్‌ ఉద్యోగులకు, అక్కడే ఉండి క్షేత్రాన్ని చూసుకుంటున్న హార్టీకల్చర్‌ హెచ్‌ఈఓలకు మధ్య మాటామాటా పెరిగింది. హెచ్‌ఈఓలు ప్రణీత్, దేవన్న, సెరికల్చర్‌ ఎస్‌వోలు షోయబ్‌ఖాన్, భరత్, బిక్యానాయక్, డి.రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల మెప్పు పొం దేందుకు తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ సెరికల్చర్‌ ఉద్యోగులు వాపోతూ తోట నుంచి బయటకు వచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సెరికల్చర్‌ ఉ ద్యోగులు తెలిపారు. మల్బరీ సాగుపై అవగాహన కల్పిం చేందుకే తమ ఉద్యోగులకు పంపినట్టు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సెరికల్చర్‌ అధికారి మెహర్‌బాషా తెలిపారు. కాగా, మామిడితోటలను పరిశీలించేందుకు హార్టికల్చర్‌ హెచ్‌ఈవో లు వెళ్లినట్టు ఆ శాఖ అధికారి శరత్‌బాబు చెప్పారు.

మరిన్ని వార్తలు