ఔత్సాహికుల కోసం సినిమా వర్క్‌షాప్

3 Aug, 2014 02:28 IST|Sakshi
ఔత్సాహికుల కోసం సినిమా వర్క్‌షాప్

సాక్షి,సిటీబ్యూరో: తెలుగు సినీ రంగంలోని వివిధ సాంకేతిక శాఖల్లో ప్రవేశించాలని కోరుకునే ఔత్సాహికుల కోసం ‘ఏ 2 జెడ్ సినిమా వర్క్‌షాప్’ పేరిట రెండు రోజుల వర్క్‌షాప్ శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. దర్శకుడు వీరశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్క్‌షాప్‌లో ‘సినిమా కథలు ఎలా దొరుకుతాయి’ (విశ్లేషణ: రచయిత కె.ఎల్.ప్రసాద్), ‘కథనం- విజయవంతమైన చిత్రాల్లో రస పోషణ‘ (పరిశోధకులు డాక్టర్ గౌతమ్ కాశ్యప్), ‘ప్రపంచ సినిమా’ (విమర్శకుడు మామిడి హరికృష్ణ), ‘దర్శకత్వం’ (ఇంద్రగంటి మోహనకృష్ణ), ‘కళా దర్శకత్వం’ (ఆర్ట్ డెరైక్టర్ అశోక్) తదితర అంశాలపై సోదాహరణంగా ప్రసంగించారు. చెన్నై, బెంగుళూరు, నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 113 మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు.

ప్రముఖ సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, త్రిపురనేని ప్రసాద్, శివనాగేశ్వరరావు, విజయభాస్కర్, రామ్‌ప్రసాద్, దేవీ ప్రసాద్, ‘హృదయ కాలేయం’ ఫేమ్ స్టీవెన్ శంకర్, ఫైట్ మాస్టర్ సతీష్ తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దాదాపు గంట పైగా కూర్చొని, హిట్ చిత్రాల రూపకల్పనకు సంబంధించి నిపుణుల విశ్లేషణ వినడం విశేషం. ఆదివారం ‘డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిసిటీ, సినిమా కలెక్షన్లు’ అంశాలపై సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు