అప్పులబాధతోనే అఘాయిత్యం!

21 Oct, 2017 08:00 IST|Sakshi

ప్రభాకర్‌రెడ్డి కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు

ప్రాథమికంగా రూ.7 కోట్ల అప్పున్నట్లు అంచనా

 ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది: పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ నార్సింగ్‌ ఠాణా పరిధిలోని కొల్లూరు సమీపంలో చోటు చేసుకున్న ‘నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య’ కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమికంగా అప్పులభారం పెరగడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తెలకు విషం ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. షేర్ల వ్యాపారంలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కాలంలో భారీగా నష్టపోయినట్లు తెలిసింది. దీంతో అనేకమంది నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చినట్లు సమాచారం. గడిచిన నెల రోజులుగా ప్రభాకర్‌రెడ్డి షేర్‌ మార్కెట్‌లో భారీ మొత్తం వెచ్చించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నూటికి రూ.3 నుంచి రూ.5 వడ్డీకి కొందరి నుంచి తక్కువ కాలంలోనే మీ మొత్తం రెట్టింపు చేస్తానంటూ హామీ ఇచ్చి మరికొందరి నుంచి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ప్రభాకర్‌రెడ్డికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా నార్సింగ్‌ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ మొత్తం రూ.7 కోట్లుగా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి పిన్ని లక్ష్మీ అతడికి ఎంత మొత్తం ఇచ్చారు? ఆ నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అనే అంశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి అప్పు ఇవ్వడమే కారణమా? మరే ఇతర కారణం ఉందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంటున్నారు.

 ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డితో పాటు లక్ష్మీకి చెందిన సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు ఆఖరిసారిగా ఎవరితో సంప్రదింపులు జరిపారు? ఏం మాట్లాడారు? వారితో వీరికి ఉన్న లావాదేవీలు ఏంటి? అనేవి తెలుసుకుంటున్నారు. దీనికోసం ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు వారితో మాట్లాడుతున్నారు. మరోపక్క ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్‌లోని అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విషయమై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌రెడ్డికి అప్పులు ఇచ్చిన, అతడి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పదుల సంఖ్యలో ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు